జవహర్‌నగర్ డంప్‌యార్డ్ తరలింపు వరకు పోరాటం ఆగదు: మల్కాజిగిరి ఎంపీ

by Taduka Kalyani |

జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తానని, సమస్య పరిష్కారమై డంప్‌యార్డ్ తరలించే వరకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

జవహర్‌నగర్ డంప్‌యార్డ్ తరలింపు వరకు పోరాటం ఆగదు: మల్కాజిగిరి ఎంపీ
X

దిశ,మేడ్చల్ : జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తానని, సమస్య పరిష్కారమై డంప్‌యార్డ్ తరలించే వరకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో జవహర్‌నగర్ డంప్‌యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష నేతలు, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు ఎంపీని కలిసి తమ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు. గత 20 ఏళ్లుగా డంప్‌యార్డ్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని వారు వివరించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పార్టీలు, జెండాలకు అతీతంగా ప్రజలు ఏకమవడం అభినందనీయమన్నారు. డంప్‌యార్డ్ సమస్యపై తాను ఎప్పటి నుంచో పోరాడుతున్నానని, గతంలో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అమలు చేయకపోవడం వల్లే పరిసర ప్రాంతాలు విషవలయంగా మారాయని ఆరోపించారు. మూసీ నది కంటే దారుణమైన పరిస్థితి డంప్‌యార్డ్ పరిసరాల్లో నెలకొందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమమే మార్గమని, జేఏసీ పిలుపునకు స్పందించిన వారిని అరెస్టు చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతానని, జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌ను అక్కడి నుంచి తొలగించే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని భరోసా ఇచ్చారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో డంప్‌యార్డ్ తొలగిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ఈటల డిమాండ్ చేశారు.

Next Story