విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేస్తే కఠిన చర్యలు: RTC MD

by Naga Rani Yarlagadda |

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి హెచ్చరించారు.

విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేస్తే కఠిన చర్యలు: RTC MD
X

దిశ, తెలంగాణ బ్యూరో : విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు సేవ చేస్తున్న తమ సిబ్బందిపై దాడి చేస్తే సహించబోమన్నారు. నల్గొండ జిల్లాలో విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ తల్లా రామ్ కుమార్ పై అకారణంగా దాడి చేసి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వెంకటేశం అనే వ్యక్తిపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జాలబావి గ్రామ సమీపంలో గల ఐటీ హబ్ వద్ద ఆదివారం ఉదయం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు డ్రైవర్ తల్లా రామ్ కుమార్ బస్సును నిర్ణీత స్టాప్ వద్ద నిలిపారు. ఆ సమయంలో తన బైక్‌పై వచ్చిన తుపాకుల వెంకటేశం అనే వ్యక్తి, బస్సును మధ్యలో ఎందుకు ఆపలేదని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి... కేవలం నిర్దేశించిన స్టాపుల వద్దే ఆపుతామని డ్రైవర్ రామ్ కుమార్ చెప్పినప్పటికీ నిందితుడు వెంకటేశం డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అనంతరం బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌ను సీటులో నుండి కిందకు లాగి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో డ్రైవర్ రామ్ కుమార్ కుడి కంటి పైన మరియు మోకాలికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బాధితుడు రామ్ కుమార్ ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ ఎస్ఐ సైదా బాబు నిందితుడు తుపాకుల వెంకటేశంపై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల విధినిర్వహణకు ఆటంకం కలిగిస్తూ వారిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ సిబ్బందికి అండగా ఉండి వారి రక్షణే తమ ధ్యేయంగా పేర్కొన్నారు.

Next Story