పర్యావరణ శిక్షణ, పరిశోధన సంస్థలో వింత పరిస్థితి

by Malleboina Mahesh |

ఈపీటీఆర్ఐ (EPTRI) లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 33 మంది ఉద్యోగులకు 300కు పైగా ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునేందుకు అనుమతించడం వివాదాస్పదమైంది.

పర్యావరణ శిక్షణ, పరిశోధన సంస్థలో వింత పరిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ శిక్షణ, పరిశోధన సంస్థ(ఈపీటీఆర్ఐ)లో వింత పరిస్థితి నెలకొన్నది. పరిపాలన అస్తవ్యస్తం కావడంతోపాటు ఫైనాన్స్ విభాగంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక్కో ఉద్యోగికి ఆర్జిత సెలవులు 300 మాత్రమే ఉంటాయి. అంతకు మించితే వాటికి కాలం చెల్లినట్టేనని సీనియర్ అధికారులు చెబుతున్నారు. కానీ ఈపీటీఆర్ఐలో మాత్రం అందుకు విరుద్ధంగా ఒక్కో ఉద్యోగికి 300లకుపైగా ఆర్జిత సెలవులు ఉన్నాయి. 31 అక్టోబర్, 2023, 31 మార్చి, 2026 వరకు 300లకు మించి ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని బోర్డు ఆఫ్ గవర్నెన్స్(బీఓజీ) నిర్ణయం విమర్శలకు దారి తీసింది.

ఈపీటీఆర్ఐలో 67మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 33 మంది ఉద్యోగులకు 302 నుంచి 607 ఈఎల్స్ ఉన్నాయి. అత్యధిక మందికి 400 పైనే ఉన్నాయి. 31 అక్టోబర్, 2023 నుంచి 31 మార్చి, 2026 వరకు ఓ ఉద్యోగికి 607 ఆర్జిత సెలవులు ఉన్నాయి. వీటిని నగదు మార్చుకోవడానికి ఈపీటీఆర్ఐ అనుమతిచ్చింది. ఇలా 33 మంది ఉద్యోగులకు 300 నుంచి 600 వరకు ఉండటం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఉద్యోగుల వినతితో వెసులుబాటు..

సెప్టెంబర్ 20, 2023న జరిగిన ఈపీటీఆర్ఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీఓజీ) 48వ సమావేశంలో ఆర్జిత సెలవుల(ఈఎల్) సంఖ్యను గరిష్టంగా 300 కి పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించింది. పదవీ విరమణ సమయంలో సెలవులను నగదు రూపంలో మార్చుకోవడానికి అవకాశముంటుందని భావించింది. ఈ పరిమితి కారణంగా కొంతమంది ఉద్యోగులు సెలవులను వినియోగించుకోకుండా, పదవీ విరమణ సమయంలో నగదుగా మార్చుకోవచ్చనే ఉద్దేశంతో 300 కి మించి సెలవులను కూడబెట్టుకున్నామని బోర్డుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన బీఓజీ అలాంటి ఉద్యోగుల విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. అలాగే, 31.03.2026 తర్వాత ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. తమ ఖాతాలో ఎటువంటి ఈఎల్స్ లేని ఉద్యోగులకు, అలాగే ఆ తేదీ తర్వాత సంస్థలో చేరే ఉద్యోగులకు ఈఎల్స్‌ను నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉండదని ఈపీటీఆర్ఐ స్పష్టం చేసింది.

ప్రైవేటు ఆడిటర్‌తో..

ఈపీటీఆర్ఐకి వచ్చే ఆదాయం నామమాత్రమే. కానీ శిక్షణ కార్యక్రమాలను మాత్రం లగ్జరీ హోటళ్లలో నిర్వహిస్తున్నారు. గతంలో బుక్స్ ప్రింట్స్‌లో అవకతవకలు జరిగాయి. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బిల్లులను సకాలంలో అందజేయకపోవడంతో పెండింగ్‌లోనే ఉంటున్నాయి. వేతనాల పెంపు విషయంలోనూ ఓ విధానమంటూ లేకపోవడంతో ఇష్టారీతిన పెంచారు. దీంతోపాటు ఆర్జిత సెలవుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సంస్థ బైలాస్ ప్రకారం ఏజీ ఆడిటర్‌తో ఆడిటింగ్ చేయించాల్సి ఉంటుంది. కానీ ఈ అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి ప్రైవేటు ఆడిటర్‌తో ఆడిటింగ్ చేయిస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Next Story