మూసీ పునరుజ్జీవాన్ని నిలిపివేయండి.. CM రేవంత్ రెడ్డికి మేధాపాట్కర్ లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-11 17:07:46  IST  )

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రణాళికల ఆవిష్కరణను వాయిదా వేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

మూసీ పునరుజ్జీవాన్ని నిలిపివేయండి.. CM రేవంత్ రెడ్డికి మేధాపాట్కర్ లేఖ
X

దిశ,తెలంగాణ బ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ (Stage-1)కు సంబంధించిన ప్రాజెక్టు ప్రణాళికల ఆవిష్కరణను 13 మార్చి 2026న నిర్వహించకుండా నిలిపివేయాలని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ ప్రతినిధి మేధా పాట్కర్ సూచించారు. ప్రజాస్వామ్యబద్దంగా సంప్రదింపులు, సమగ్ర సమీక్ష, ప్రజా, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె బుధవారం లేఖ రాశారు. ‘మూసీ నది తీరప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల హక్కుల కోసం తెలంగాణ పౌర సమాజం ఐక్యంగా కలిసి ఏర్పాటు చేసిన మూసీ జన ఆందోళన్ తరఫున ఈ లేఖ రాస్తున్నాను. ఇది అత్యంత ముఖ్యమైన విషయం అని మీకు తెలిసినదే. అందువల్ల మీ వ్యక్తిగత దృష్టి అవసరం. సాధ్యమైతే ప్రభావిత ప్రజలు, సంబంధిత ప్రతినిధులు, మూసీ జన ఆందోళన్ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా మీతో చర్చించాలని నేను కోరుకుంటాను. అయితే సమయం తక్కువగా ఉన్నందున ఈ లేఖను ఇ-మెయిల్ ద్వారా పంపుతున్నాను. ఒక నాయకుడిగా ప్రజల సమస్యలను సున్నితంగా, దృఢంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను.

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ దేశంలో ప్రతిపాదించబడిన 100కిపైగా నది తీర అభివృద్ధి ప్రాజెక్టులలో ఒకటి. వీటిలో చాలా ప్రాజెక్టులు బీజేపీ లేదా దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలలో ప్రతిపాదించబడ్డాయి. వాటిలో అనేకం సామాజిక, పర్యావరణ పరంగా తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించాయి. ఉదాహరణకు గుజరాత్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలితంగా అనేక మార్గదర్శకాలు, సవరణలు చేపట్టాల్సి వచ్చింది. తెలంగాణలో మూసీ ప్రాజెక్ట్ తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కాలంలో ప్రతిపాదించబడింది. అయితే 1990ల నుంచి మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల నిరసనలు, సవాళ్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ పలుమార్లు నిలిచిపోయింది. 2017లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంఆర్డీసీఎల్ ను ఏర్పాటు చేసినప్పటికీ ప్రాజెక్ట్ అమలులోకి రాలేదు. మీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను ‘ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం’గా మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఇది భారీ స్థాయిలో ఉండటం వల్ల సామాజిక, పర్యావరణ పరమైన ప్రభావాలు కూడా విస్తృతంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల వేలాది కుటుంబాలు – ముఖ్యంగా పట్టణ కార్మిక వర్గం, మధ్యతరగతి కుటుంబాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు – తమ నివాసాలను కోల్పోయే పరిస్థితి వస్తోంది. హైకోర్టు భవనం వంటి వారసత్వ నిర్మాణాలకూ ప్రమాదం కలగవచ్చు. ఇటీవల జరిగిన కూల్చివేతల వల్ల ఇప్పటికే సుమారు 300 ఇళ్లు ప్రభావితమయ్యాయి. ప్రత్యామ్నాయ గృహాలు ప్రజల అవసరాలకు సరిపోకపోవడంతో పాటు వారి జీవనోపాధిని కూడా దెబ్బతీస్తున్నాయి. జీవితాంతం కూడబెట్టిన పొదుపులతో నిర్మించుకున్న విశాలమైన ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలుగా నివసించిన అనేక మంది పై ఇది తీవ్ర సామాజిక-ఆర్థిక ప్రభావం కలిగిస్తోంది’ అని మేధాపాట్కర్ లేఖలో పేర్కొన్నారు.

Next Story