- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూసీ పునరుజ్జీవానికి వడివడిగా అడుగులు.. ఏకంగా ఆరు మాస్టర్ ప్లాన్లు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మెయిన్ హర్ట్ ఏజెన్సీతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) 4 డిసెంబర్ 2024న ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. డీపీఆర్ తయారు చేయడానికి 18 నెలల సమయం పడుతుందని ఒప్పందంలో రాసుకున్నారు. ఇప్పటి వరకు 13 నెలలు పూర్తయింది. అయితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్లకు సంబంధించిన డీపీఆర్ రెడీ అయింది. ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. ఈ వారంలో డీపీఆర్ ప్రకటించే అవకాశముంది. మార్చి31లోగా మొదటి దశకు సంబంధించిన పనులను ప్రారంభించే అవకాశముందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో ఆరు మాస్టర్ ప్లాన్లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బ్లూ మాస్టర్ ప్లాన్
నది ప్రాంతంలో నీటి శ్రేణులు, నదులు, ఇతర జల వనరుల నిర్వహణ, సంరక్షణ కోసం సమగ్రంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మూసీ, ఈసా నదులను పరిరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను విధించింది. వాటి పరిధిలో నిర్మాణాలకు అడ్డుకట్టవేసింది.
గ్రీన్ మాస్టర్ ప్లాన్
బ్లూ మాస్టర్ ప్లాన్‌కు అనుసంధానంగా గ్రీన్ మాస్టర్ ప్లాన్ సైతం రూపొందించనున్నారు. నది ప్రాంతంలో గ్రీన్ స్పేసెస్, పార్కులు, పర్యావరణ మిత్రమైన ప్రయత్నాల అభివృద్ధి, మెరుగుదల, నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ పార్కులు ఏర్పాటు చేయాలి? రీక్రియేషన్ జోన్లను ఏర్పాటు చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు.
భూమి ఉపయోగ మాస్టర్ ప్లాన్
మూసీ నది 55 కిలోమీటర్ల ప్రాంతంలో వివిధ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. జోనింగ్ నియమాలు, అందుబాటులో ఉన్న భూమిని వివిధ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. జోనింగ్ విధానంపై ఉత్తరకొరియాలోని సియోల్, గుజరాత్‌లోని సబర్మతి నది ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించిన విషయం తెలిసిందే. అంగుళం భూమిని కూడా వృథాగా పోకుండా వినియోగించుకునేవిధంగా ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు
మూసీ ప్రాజెక్టులో మార్కీ (ల్యాండ్ మా ర్క్) ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. మూసీ సమీప ప్రాంతాల్లో టూరిజాన్ని కేంద్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో అవసరమైన ప్రాజెక్టులను రూపొందించడం, ఇందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే లంగర్ హౌస్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనికోసం 200 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ రక్షణ శాఖ మాత్రం 45 ఎకరాల భూమిని ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, నాగోల్‌లో శిల్పారామం, జాతీయ జెండా ఏర్పాటు చేసిన ప్రాంతాలను మార్కీ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దాలని మాస్టర్ ప్లాన్ తయారుచేయనున్నారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్
రహదారులు, నీరు, విద్యుత్, నాలాలు, ఇతర ప్రధాన సేవల అభివృద్ధి గురించి వివరించే ప్రణాళికను తయారు చేయనున్నారు. ఈ ప్రణాళిక, అవసరమైన భౌతిక వసతులను పెంచి, సుస్థిర అభివృద్ధిని, ప్రాంతంలో సమగ్ర కనెక్టివిటీని నిర్ధారించేవిధంగా ఉండాలని ప్రభుత్వం సూచించిం ది. వీటిలో ముఖ్యంగా ఈస్ట్-వెస్ట్ కారిడార్ కోసం డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించారు. మూసీకి ఇరువైపులా ఈస్ట్-వెస్ట్ కారిడార్ అభివృద్ధి, ప్రణాళిక, అమలు గురించి సమగ్ర సాంకేతిక నివేదిక తయారు చేయనున్నారు.
ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, భూమి ఉపయోగ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్లతోపాటు ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ సుందరీకరణతోపాటు ఆర్థికపరమైన వనరులను సృష్టించేందుకు ప్రత్యేక ప్లాన్ తయారు చేయనున్నారు. అయితే మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.5కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.5కి.మీ మొత్తం 21కి.మీ మార్గాన్ని డెవలప్ చేయనున్నారు. బాపుఘాట్ వద్ద ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీన్ని పర్యాటక కేంద్రంతోపాటు ఫైనాన్సియల్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు 55కి.మీ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 55కి.మీ మార్గంలో ఐదు ప్రాంతాల్లో ట్రంపెట్ క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ఎంఆర్డీసీఎల్ కు ప్రభుత్వం 736ఎకరాలను కేటాయించింది. ఈ భూముల్లో ఫార్మా, ఐటీ, జీసీసీలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.
డీపీఆర్‌కు మరో ఏడాది
మూసీ పునరుజ్జీవనం మొత్తం ప్రాజెక్టు పూర్తిచేయడానికి మరో ఏడాది సమయం పడుతుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ డీపీఆర్ బాధ్యతలను సింగపూర్‌కు చెందిన మెయిన్ హార్ట్ ఏజెన్సీకి అప్పగించారు. దీంతోపాటు నీటి వనరుల సంరక్షణకు సంబంధించిన ప్లాన్ తయారు చేయడానికి కుషుమెన్, వేక్ ఫీల్డ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్, ఫైనాన్సియల్ ప్లాన్ రూపొందించే బాధ్యతలను రియోస్ డిజైన్ స్టూడియో ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు అప్పగించామని సీఎం వెల్లడించారు.
ఏడీబీ రుణం రూ.4,100 కోట్లు
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం ఏసియా డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) రూ.4,100కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సైతం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్(ఎన్ఆర్సీపీ)లో భాగంగా మూసీలోని శుద్ధిచేసిన నీటిని వినియోగించుకోవడానికి రూ.3,188కోట్ల ప్రతిపాదనలను కేంద్ర జలశక్తిశాఖకు పంపించారు.






