TG: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు స్టీరింగ్ కమిటీ

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని.. ఇందుకు నీటిపారుదల రంగ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

TG: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు స్టీరింగ్ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని.. ఇందుకు నీటిపారుదల రంగ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో ఆదివారం సెక్రెటేరియట్‌లో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కమిటీ వారానికి రెండు సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తుందన్నారు. అవసరమైతే స్వయంగా తాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షిస్తానని చెప్పారు. అంతేగాకుండా ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి నియమించనున్నట్లు ఆయన తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. కేఎల్ఐఎస్ మరమ్మతుల పూర్తి ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని.. అదే సమయంలో మేడిగడ్డను కొంత భాగన్ని పూర్తి చేయగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఏఎఫ్ఆర్‌వై ఇండియాకు డిజైన్ల బాధ్యత..

ప్రభుత్వం ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్‌గా ఏఎఫ్ఆర్‌వై ఇండియాను ఎంపిక చేసి.. ఐఐటీ ముంబయితో సంయుక్తంగా పని చేయాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. డిజైన్ బృందం రాత్రింబళ్లు పనిచేసి వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. డిజైన్ సిద్ధమైన వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని చెప్పారు. సెక్రటరీ పరిక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు ఆయన సూచించారు. డిజైన్ ప్రక్రియకు సంబంధించిన భూ భౌతిక, భూ సాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

సీడబ్ల్యూపీఆర్ఎస్‌కు ప్రాధాన్యం..

పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ సీడబ్ల్యూపీఆర్ఎస్‌కు ఈ పరీక్షలు, అధ్యయనాల బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల కమిషన్‌తో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. సిబ్బంది 45 రోజుల పరీక్షల కాలంలో నిరంతరం ప్రాజెక్ట్ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు. ఎల్ అండ్ టీ సహా అమలు సంస్థలు తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని సూచించారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్ నాథ్, జాయింట్ సెక్రెటరీ కే.శ్రీనివాస్, టన్నెల్ నిపుణులు పరిక్షిత్ మెహ్రా, ఈఎన్సీలు రమేశ్‌బాబు, శ్రీనివాస్‌తోపాటు సీడబ్ల్యూపీఆర్ఎస్ ఆదనపు డైరెక్టర్ సెల్వా బాలన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story