HYD: అత్యంత రద్దీ ప్రాంతంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. అధికారులకు CM రేవంత్ ఆదేశాలు జారీ

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

HYD: అత్యంత రద్దీ ప్రాంతంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. అధికారులకు CM రేవంత్ ఆదేశాలు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పార్కు చుట్టూ రోడ్డు విస్తరణతోపాటు ఏడు జంక్షన్లలో ఆరు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాసులను నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. వాటి పనులు చేపట్టేందుకు శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. రూ.1090కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,032కోట్లతో హెచ్-సిటీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్కుకు ఆనుకొని ఆరు వంతెనలు(బ్రిడ్జిలు), ఏడు అండర్ పాస్‌ల నిర్మాణానికి రూ.1090 కోట్లు ఖర్చు అవుతుందని జీహెచ్‌ఎంసీ అంచనా వేసింది.

ఆరు స్టీల్ బ్రిడ్జిలు-ఏడు అండర్ పాస్‌లు

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను రెండు ప్యాకేజీల కింద చేపట్టనున్నారు. రూ.580 కోట్ల అంచనా వ్యయంతో కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ రెండు స్టీల్ బ్రిడ్జిలు, మూడు అండర్ పాస్‌లను నిర్మించనున్నారు. వీటిన్నింటినీ తొలి ప్యాకేజీ కింద చేపడతారు. రెండో ప్యాకేజీ కింద... రూ.510కోట్లతో పనులు చేపడతారు. రోడ్డు నం.45 జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, కేన్సర్ హస్పిటల్ జంక్షన్లలో నాలుగు స్టీల్ బ్రిడ్జిలు, నాలుగు అండర్ పాస్‌లను ఏర్పాటు చేస్తారు. కేబీఆర్ పార్కు నుంచి... హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర మార్గాలకు నేరుగా చేరుకునేందుకు సలువైన మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

టెండరింగ్ వివరాలు

తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీచేసిన జీహెచ్‌ఎంసీ టెండర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. సూపరింటెండెంట్ ఇంజినీర్, ప్రాజెక్టు విభాగం-వెస్ట్‌జోన్, ట్యాంకు బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద టెండర్లను దాఖలు చేయవచ్చునని సలహా ఇచ్చింది. బిడ్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుంచి .. మార్చి24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఇచ్చింది. ఫ్రీ బిడ్ మీటింగ్ మార్చి 10న చేపట్టనున్నది. టెక్నికల్ బిడ్ ఓపెనింగ్ మార్చి 24వ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటల తరువాత ఉంటుంది. ప్రైస్ బిడ్ ఓపెనింగ్ మార్చి 26వ తేదీ మధ్యాహ్నం 4గంటల తర్వాత ఉంటుందని సంబంధిత అధికారులు తెలియజేశారు.

Next Story