- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
‘తెలంగాణ రైజింగ్-2047’ దిశగా అడుగులు
ఈ సందర్భంగా డా. శశాంక్ గోయల్ ప్రసంగిస్తూ.. తెలంగాణ రాష్ట్రం పారదర్శక విధానాలతో పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా మారిందన్నారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక శక్తికి నిదర్శనమని కొనియాడారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ప్రపంచస్థాయి లక్ష్యాలతో ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే పారిశ్రామిక, పర్యాటక, గ్రీన్ ఎనర్జీ పాలసీలను సిద్ధం చేసిందన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు.. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత, ఆరోగ్యశ్రీ పథకాల అమలు తీరును ఆయన వివరించారు.
తెలంగాణకు ముఖచిత్రం.. ‘తెలంగాణ భవన్’
ఢిల్లీలో తెలంగాణ భవన్ కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదని, సంక్షోభ సమయాల్లో (ఉక్రెయిన్ యుద్ధం తదితర) ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించే సహాయ కేంద్రంగా విశేష సేవలు అందిస్తోందని డా. గోయల్ గుర్తుచేశారు. నిరంతరం శ్రమిస్తున్న ప్రొటోకాల్, సమాచార-పౌర సంబంధాల (I&PR), పర్యాటక శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జూన్ 5న ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ ప్రాంగణంలో ప్రైమస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్‌ను డా. శశాంక్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, భవన్ అధికారులు, సిబ్బంది, ఢిల్లీలో నివసిస్తున్న పలువురు తెలంగాణ వాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5వ తేదీ సాయంత్రం 7 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయల్






