స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు..

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-13 11:44:44  IST  )

తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం 'స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ (SMAC)' ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో వివిధ జర్నలిస్ట్ సంఘాలు, ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులకు చోటు కల్పించారు. 'తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025' ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల మంజూరు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీని (SMAC) ఏర్పాటు చేస్తూ సమాచార, పౌర సంబంధాల (I&PR) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025 ప్రకారం ఈ కమిటీ పనిచేయనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో ప్రభుత్వం, వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించారు.

కమిటీకి మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు. కో-చైర్మన్‌గా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఉంటారు. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధుల నుంచి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-9), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (H-143), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF), తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TJA) ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు.

ప్రింట్ మీడియా సంస్థల ప్రతినిధులుగా ఈనాడు నుంచి ఎ. రంగారావు, సియాసత్ నుంచి అమీర్ అలీ ఖాన్, ‘దిశ’ డైలీ నుంచి బ్యూరో చీఫ్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి, పొద్దు నుంచి బైస రామదేవిలను సభ్యులుగా నియమించారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా (V6) నుంచి మురళీకృష్ణ, ఫోటో జర్నలిస్ట్స్ (డెక్కన్ క్రానికల్) నుంచి బి.హెచ్.కె. గాంధీ, వీడియో జర్నలిస్ట్స్ నుంచి బిగ్ టీవీ నాగేశ్వరరావు, మహిళా జర్నలిస్టులుగా ఎన్టీవీ నుంచి రాధిక, ది హిందూ నుంచి స్వాతి వడ్లమూడి, చివరగా డెస్క్ జర్నలిస్ట్స్ ప్రతినిధిగా ఆంధ్రజ్యోతి నుంచి బి. శ్రీనివాస్ రావు వ్యవహరించనున్నారు.

ఇతర కీలక సభ్యులు, బాధ్యతలు..

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) సభ్యుడు, టీజీఆర్‌టీసీ (TGRTC) ప్రతినిధి, దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ (I&PR) శాఖ జాయింట్ డైరెక్టర్ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా (Convener) వ్యవహరిస్తారు. అర్హులైన జర్నలిస్టుల దరఖాస్తులను పరిశీలించి అక్రిడిటేషన్ కార్డులను జారీ చేసే బాధ్యతను ఈ కమిటీ నిర్వహిస్తుంది. అలాగే జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలకు ఆమోదం తెలిపే అధికారాన్ని ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్‌కు ప్రభుత్వం అప్పగించింది.

Next Story