శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

by Bhanu |

ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యామ్ నుంచి కృష్ణా నదిలో వరద నీరు తరలుతుండగా, జూరాల ప్రాజెక్టు నుంచి 15 గేట్ల ద్వారా శ్రీశైలం

శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద
X

దిశ, అచ్చంపేట : ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యామ్ నుంచి కృష్ణా నదిలో వరద నీరు తరలుతుండగా, జూరాల ప్రాజెక్టు నుంచి 15 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ శబ్దాలతో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలానికి ఒక లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు ప్రవేశించగా, ప్రాజెక్టు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 67 వేల క్యూసెక్కుల కంటే అధికంగా నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు కుడి, ఎడమవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 881.60 అడుగులకు చేరుకుంది. మొత్తం 215.807 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో, బుధవారం నాటికి 196.561 టీఎంసుల నీరు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.

అధికారులు ఎగువనుంచి వచ్చే వరద ప్రవాహాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. మరింత వరద ప్రవాహం పెరిగితే, ప్రాజెక్టులో గేట్లను మళ్లీ ఎత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యుత్ కేంద్రాల ద్వారా కొనసాగుతోంది.

Next Story