- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండకు జీవనాడిగా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు.. టార్గెట్ 2027
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2027 డిసెంబర్ 9వ తేదీన ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తామని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనుకోని ఘటనతో పనులు పెండింగ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చూపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టాక దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనులు చకచకా ప్రారంభించింది. అనుకోకుండా జరిగిన ఘటనతో పనులకు బ్రేక్ పడింది. 22 ఫిబ్రవరి 2025న నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ఒక భాగం కూలిపోయింది. అకస్మాత్తుగా నీరు, బురద రావడంతో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
2027 డిసెంబర్ 9 టార్గెట్
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంబంధిత అధికారులకు టార్గెట్ విధించారు. ఇటీవల నిర్వహించిన నీటిపారుదల శాఖ సమావేశంలో వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా మూడు నెలల లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆఫీసర్లకు ఆదేశించారు. పనులు తిరిగి ప్రారంభించడానికి, వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులూ పొందేందుకు ఈ నెల 15లోపు కేబినెట్ సమావేశాన్ని షెడ్యూల్ చేయాలని ఆదేశించారు.
ప్రపంచ స్థాయి సాంకేతిక వినియోగం
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో పనులు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరోసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ మేరకు ప్రపంచ స్థాయి సాంకేతికతను వినియోగించాలని భావించింది. ఈ మేరకు ప్రపంచంలోని తాజా సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటైన హెలి-బోర్న్ సర్వేను ఎంచుకుంది. దీనిని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుంది. అలాగే సొరంగం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు గతంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్‌సింగ్‌ను ఇటీవల సలహాదారుగా నియమించింది. ఆయన ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంతో పాత యంత్రం సొరంగంలోనే చిక్కుకుపోయింది. దానిని బయటకు తీసే పరిస్థితి లేక పోవడంతో సొరంగంలోనే వదిలి పెట్టనున్నారు. అందుకు దాని చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించి పూర్తిగా మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతం నుంచి అలైన్‌మెంట్‌ను మార్చి, మిగతా వర్క్స్ పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇప్పటికే 14 కిలోమీటర్ల పనులు పూర్తి
ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించేందుకు మొత్తం 50.75 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు నిర్మించాల్సి ఉంది. ఇందులో 44 కిలోమీటర్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా 9.6 కిలోమీటర్ల మేర పనులు మిగిలి ఉన్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు మూడు షిఫ్టులలో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సొరంగం పనులు పూర్తయి వినియోగంలోకి వస్తే రోజుకు 0.3 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. ఇది దాదాపు 90 రోజుల పాటు నీటిని అందిస్తుంది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నీటి అవసరాలను తీరుస్తుంది.






