- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని దుష్ప్రచారం.. ప్రభుత్వం మీ వెంటే: శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మండిపడ్డారు. అలాంటి వారు ఒక్కసారి కళ్లు తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో "టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో 2025"ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4 శాతం వృద్ధి రేటు నమోదు అయ్యిందని తెలిపారు. నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం రూ.80వేల కోట్లు సమకూర్చుతోందని, తెలంగాణ సర్వీసెస్ ఎకానమీలో ఈ రంగం వాటా 24.9 శాతం అని తెలిపారు.
ప్రస్తుతం రెరా దగ్గర 9744 రియల్ ఎస్టేట్ (Real estate) ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయని, ఇవి గణాంకాలు కాదు.. మా హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి చెంప దెబ్బ అని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్క హైదరాబాద్ లోనే 5,900 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.కోటి, అంత కంటే ఎక్కువ ధర గల ఇళ్ల వాటా 18 శాతంగా ఉందని తెలిపారు. ఈ తరహా ఇళ్ల కొనుగోలులో వార్షిక వృద్ధి రేటు 58 శాతంగా నమోదు అయ్యిందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని అన్నారు. తొలి దశలో 4.16 లక్షలు ఇచ్చామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న నిర్మాణ రంగం అని, దాని అభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘ఈ వేదిక ద్వారా బిల్డర్లు, కొనుగోలుదారులకు ఒక్కటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వం మీ వెంట ఉంది. నిర్మాణ రంగ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి"అని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గండ్ర సత్యనారాయణ రావు, క్రెడాయ్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






