జనవరి 1 నుంచి నుమాయిష్.. పిల్లలకు ప్రవేశం ఉచితం.. పూర్తి వివరాలు ఇవే..

by Ramesh Naini |

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నుమాయిష్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

జనవరి 1 నుంచి నుమాయిష్.. పిల్లలకు ప్రవేశం ఉచితం.. పూర్తి వివరాలు ఇవే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నుమాయిష్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. చారిత్రాత్మక నుమాయిష్ హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగమని, ప్రజలందరూ సురక్షితంగా ప్రదర్శనను సందర్శించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశాముని మంత్రి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు జరుగుతుందని, దీనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 11 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు.

పిల్లలకు ప్రవేశం ఉచితం..

ప్రవేశ రుసుముగా ఒక్కరికి రూ.50 కాగా, 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితమని స్పష్టం చేశారు. ప్రదర్శన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సబ్ కమిటీలు ఏర్పాటు చేశామని.. మొత్తం 330 మంది వలంటీర్లు విధుల్లో ఉంటారని వివరించారు. ఈ ఏడాది స్టాళ్లకు వివరీతమైన డిమాండ్ ఉండని, వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1,050 మంది తయారీదారులు, కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. వీటితోపాటు 20 ఫుడ్ కోర్టు, రిజర్వ్ బ్యాంక్, అటవీ శాఖ, పర్యాటక తదితర శాఖల స్టాళ్లు కూడా ఉంటాయని తెలిపారు. గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుందని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు స్టాల్స్ కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

2,000లకు పైగా స్టాల్స్

నుమాయిష్ 1938లో మొదలైందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2,000లకు పైగా స్టాల్స్ ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. నుమాయిష్‌కు 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. లక్షన్నర లీటర్ల నీటి కెపాసిటీతో రెండు సంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 82 ఫైర్ పాయింట్స్ ఏర్పాటు చేశామని.. ప్రతి రెండు ఫైర్ పాయింట్స్‌కు ఒక సిబ్బంది ఉంటారని వెల్లడించారు. పోలీస్ నిఘా కోసం వాచింగ్ టవర్స్, సెల్ సిగ్నల్స్ కోసం ప్రత్యేక సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఓ వైపు షాపింగ్, మరోవైపు ఎంజాయ్‌మెంట్ ఒకే దగ్గర దొరకడంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వెళ్లేందుకు ప్రజల ఆసక్తి చూపుతుంటారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉన్నదని తెలిపారు. నుమాయిష్ వల్ల వచ్చే ఆదాయంతో 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. 30 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారని.. ఈ విద్యా సంస్థలలో 2వేల మంది స్టాఫ్ ఉన్నారని తెలిపారు. దేశంలోనే పెద్ద నుమాయిష్ హైదరాబాద్‌లోనే జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం రెవెన్యూ వస్తుందని చెప్పారు.

Next Story