Sridhar Babu: అలా చేస్తే.. పురుగు మందుల వినియోగాన్ని తగ్గించొచ్చు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో సాగు వ్యయం.. రసాయనాల వాడకాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: అలా చేస్తే.. పురుగు మందుల వినియోగాన్ని తగ్గించొచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సాగు వ్యయం.. రసాయనాల వాడకాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు. కృత్రిమ మేథ(ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌‌ను రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై మంగళవారం సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్‌హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధుల బృందంతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాగులో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని.. రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు తన చేయూతను అందిస్తున్నదని.. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌కు రాష్ట్రం గ్లోబల్ హబ్‌గా మారిందని తెలిపారు.

ఇలాంటి తరుణంలో డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని సంకల్పించామని వివరించారు. రోజురోజుకూ వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతున్నదని.. సాగులో పురుగు మందుల వినియోగం పెరిగి పర్యావరణానికి ఎంతో హానీ జరుగుతున్నదని తెలిపారు. ఇలాంటి తరుణంలో పెట్టుబడి వ్యయం, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌ను వ్యవసాయానికి అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే.. టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నదని వెల్లడించారు. అత్యాధునిక సెన్సార్ల ద్వారా నేల స్వభావాన్ని రైతులు ముందే తెలుసుకోవచ్చని.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించొచ్చని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో రెండేళ్లుగా వేములవాడకు సమీపంలోని మూడు గ్రామాల్లో ‘ఫ్రాన్‌హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘యాక్సిలరేటింగ్ క్లైమేట్-రెసిలియెంట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ’ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చొరవ చూపాలని సంస్థ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జర్మనీ రాయబార కార్యాలయం(న్యూఢిల్లీ) ఫుడ్, అగ్రికల్చర్ డివిజన్ హెడ్ వోల్కర్ క్లైమా, ఫ్రాన్ హోఫర్ హెచ్ హెచ్ ఐ ప్రతినిధులు డా.సెబాస్టియన్ బోస్సే, డా.రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.

ఖర్గేకు మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు. ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని, పూర్తి ఉత్సాహంతో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఆయన మార్గదర్శకత్వం అత్యంత అవసరమన్నారు.

Next Story