Sridhar Babu: అమెరికా వెలుపల, భారత్‌లో మొట్టమొదటిది ఇదే..

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

Sridhar Babu: అమెరికా వెలుపల, భారత్‌లో మొట్టమొదటిది ఇదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన రాయదుర్గంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. హెచ్‌సీఏ హెల్త్‌కేర్ ప్రధానంగా అమెరికా, యూకేలలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని.. ఈ సంస్థకు 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు ఉన్నాయని.. మొత్తం 3.16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ ఫార్చ్యూన్ 100 కంపెనీల వార్షిక ఆదాయం 70 బిలియన్ డాలర్లు అని వివరించారు. ఇలాంటి దిగ్గజ సంస్థ అమెరికా వెలుపల భారత్‌లో తన మొట్టమొదటి జీసీసీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణను ఎంచుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఇది హైదరాబాద్‌కున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నిదర్శనమని పేర్కొన్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో హెచ్‌సీఏ హెల్త్ కేర్ 75 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 620 కోట్లు) పెట్టుబడి పెట్టనుందని తెలిపారు.

ఈ జీసీసీ కేవలం ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణలో నాణ్యత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. ఐటీ, సప్లై చైన్, ప్రొక్యూర్‌మెంట్, మానవ వనరులు, ఫైనాన్స్, అకౌంటింగ్ తదితర విభాగాల్లో ప్రస్తుతం 1,200 మందికి, 2026 నాటికి 3 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ రంగాలకు ముఖద్వారంగా ఎదుగుతున్నదని.. ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, 800కు పైగా ఫార్మా కంపెనీలు, ప్రముఖ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ జీసీసీలు, అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో గ్లోబల్ హెల్త్ కేర్ హబ్‌గా రూపాంతరం చెందుతున్నదని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూనే సరసమైన ఆరోగ్య సంరక్షణను ప్రపంచానికి అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్‌కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, హెచ్‌సీఏ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మైక్ మార్క్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్, హైదరాబాద్ సెంటర్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ అతుల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు

యువతలో అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా తూంకుంటలోని అలంకృత రిసార్ట్‌లో ‘డేర్ టూ డ్రీమ్’ పేరిట సిఖ్ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఆలోచనలకు, ఆకాంక్షలకు పరిమితులు పెట్టుకోవద్దని యువతకు దిశానిర్దేశం చేశారు. కలలు కనడం ఎంత ముఖ్యమో, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడటం కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సిఖ్ సొసైటీ ప్రతినిధులు తేజ్‌దీప్‌కౌర్, గగన్ కోహ్లీ, సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story