బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు.. మౌళిక వసతులు నిల్

by Disha Web Desk 4 |
బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు.. మౌళిక వసతులు నిల్
X

దిశ, భీమదేవరపల్లి : గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామీణ క్రీడా ప్రాంగణాల కోసం ప్రభుత్వం రూ. 2 లక్షల 50 వేలు కేటాయించినప్పటికీ పలుచోట్ల క్రీడా ప్రాంగణాలకు చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో 22 గ్రామాలకు గాను 18 గ్రామాల్లో తెలంగాణ క్రీడ ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. మండలంలోని బొల్లోనిపల్లి, కొత్తకొండ, గొల్లపల్లి, విశ్వనాధ కాలనీ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయలేదు. కొత్తకొండ గ్రామంలో స్థల వివాదం వల్ల అధికారులు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. మండలంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో యువత క్రీడల పట్ల ఆసక్తి చూపలేకపోతున్నారు.

మరికొన్ని ప్రభుత్వ పాఠశాల అనుసంధానంగా ఏర్పాటు చేశారు. మండలంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో ఒక్కరోజు కూడా ఏ ఒక్క క్రీడా నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ క్రీడా ప్రాంగణాలు క్రీడలు ఆడడానికి అనువుగా లేని స్థలాల్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంకల్పం ఆచరణలో విఫలమవుతుందని, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. క్రీడా ప్రాంగణాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగపరుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో అనువైన స్థలాలను ఎంపిక చేయలేకపోవడంతో అలంకారప్రాయంగా, కేవలం బోర్డులకే పరిమితంగా మారాయి.

ఈనెల 15 నుండి సీఎం కప్ గ్రామీణ క్రీడలు

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈనెల 15 నుండి సీఎం కప్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. మే 15 నుండి 17 వరకు మండల స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా ఇందుకు 15 ఏళ్ల వయసు నుండి 36 ఏళ్ల వయసు ఉన్న యువతి, యువకులు క్రీడల్లో పాల్గొనవచ్చునని ప్రకటించారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, కోకో, ఫుట్ బాల్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. కానీ ఈ క్రీడలను క్రీడా ప్రాంగణాలలో కాకుండా మండలంలోని భీమదేవరపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే క్రీడలను క్రీడా ప్రాంగణాల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎం కప్ పోటీలను నిర్వహించడానికి అనువుగా క్రీడా ప్రాంగణాలు లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలలో ఈ క్రీడలను నిర్వహిస్తున్నారని మండల వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించాలంటే గ్రామాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో శిక్షణ తీసుకోలేక గ్రామీణ యువత రాష్ట్ర స్థాయి వరకు ఎలా రానిస్తారనేది ప్రశ్నగా మారింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలు లేకుండా సీఎం కప్ పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు రాణించేది ఎట్లా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో కనీస వసతులు కల్పించి యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకునే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

క్రీడా పోటీలకు క్రీడా ప్రాంగణాలలో సౌకర్యాలు లేక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు

ఎల్. భాస్కర్

భీమదేవరపల్లి ఎంపీడీవో

క్రీడా ప్రాంగణాలలో సరైన సౌకర్యాలు లేక సీఎం కప్ పోటీలను భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల క్రీడా ప్రాంగణాల్లో పోటీలు నిర్వహించలేకపోతున్నాం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలను నిర్వహిస్తాము. మండలంలో 18 క్రీడా ప్రాంగణాలు పూర్తి అయ్యాయి. మరో నాలుగు అసంపూర్తిగా ఉన్నాయి వీటిని త్వరలో పూర్తి చేస్తాం.


Next Story