కాంగ్రెస్ పార్టీతో మాకు పోటీ లేదు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ పార్టీతో మాకు పోటీ లేదు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పార్లమెంటు ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ పార్టీతో పోటీ లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేములవాడ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు కాంగ్రెస్ తో పోటీ లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ పడేది బీజేపీతోనే తప్పితే కాంగ్రెస్ తో కాదని ఆయన స్పష్టంచేశారు.

అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది వారి కార్యకర్తలకే తెలియదని, బీజేపీ, కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఎవరో అనామకుడిని తీసుకువచ్చి చివరి రోజు అభ్యర్థిగా ప్రకటించారని, పార్టీ కండువా లేకుండా ఆయనను తిప్పాపూర్ బస్టాండ్ వద్ద నిలబెడితే గుర్తు పట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బడే భాయ్ నరేంద్ర మోదీ బీజేపీ సర్కార్ తెలంగాణ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, తల్లిని చంపి, బిడ్డను వేరు చేశారనే మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను కించపరిచారని మండిపడ్డారు. ఇక చోటే భాయ్ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కి నేడు హామీలు అమలు చేయమంటే ఖజానా ఖాళీగా ఉంది అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ చిల్లర మాటలు, ఉద్దెర పనులని మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడినా దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని, కనీసం కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలకు ఒక్క రూపాయి తేలేదని,

ఏమన్నా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటున్నాడని ఆరోపించారు. అంటే కేవలం ఓట్ల కోసమేనా దేశం, ధర్మం అంటూ ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారకుండా, గోదావరి జలాలను కావేరి, పెన్నా నదిలోకి వెళ్లకుండా, 2026 పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం జరగకుండా, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చకుండా, బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి గులాబీ కండువాకు మాత్రమే ఉందని, అందుకే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలను మళ్లీ చేయకండి అంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికలు సమీపిస్తుండటం, గడువు తక్కువ ఉన్నందున పార్టీ శ్రేణులందరూ పట్టణాల్లో, గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బీజేపీ, కాంగ్రెస్ వైఖరిని తెలియజెప్పి,

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలను వివరించాలని, అదే సమయంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముఖ్యంగా వినోద్ కుమార్ వంటి మేధావులు ఉంటే జరిగే లాభాలను వివరించాలని, ఎవరు ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. ఈ ఎన్నికల గెలుపు స్పూర్తితో తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తనతో పాటు వినోద్ కుమార్, లక్ష్మీ నరసింహారావులతో పాటు పార్టీ శ్రేణులందరం అండగా ఉంటామని, ఎవరు ఎలాంటి నిరాశకు గురి కావద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. అదే క్రమంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే10న సిరిసిల్లలో పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో ఉంటుందని, ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed