అతివేగం.. నిర్లక్ష్యం.. ఔటర్‌పై డెత్ కారిడార్.. ఐదేళ్లలో 369 బలి

by Ramesh Naini |

హైదరాబాద్ అభివృద్ధికి తలమానికంగా, ట్రాఫిక్ కష్టాలకు చెక్‌పెట్టే ఔటర్ రింగ్ రోడ్డు నిత్యం నెత్తురోడుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు నిర్మించిన 158 కిలోమీటర్ల ఈ ప్రతిష్టాత్మక హైవే.. ఇప్పుడు వాహనదారుల పాలిట మృత్యుపాశంగా మారింది.

అతివేగం.. నిర్లక్ష్యం.. ఔటర్‌పై డెత్ కారిడార్.. ఐదేళ్లలో 369 బలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ అభివృద్ధికి తలమానికంగా, ట్రాఫిక్ కష్టాలకు చెక్‌పెట్టే ఔటర్ రింగ్ రోడ్డు నిత్యం నెత్తురోడుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు నిర్మించిన 158 కిలోమీటర్ల ఈ ప్రతిష్టాత్మక హైవే.. ఇప్పుడు వాహనదారుల పాలిట మృత్యుపాశంగా మారింది. మితిమీరిన వేగం, నిబంధనల ఉల్లంఘన, ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న భారీ వాహనాల కారణంగా ఈ మార్గం డెత్ కారిడార్‌ను తలపిస్తోంది. యంత్రాంగం పర్యవేక్షణ లోపం, ప్రయాణికుల అజాగ్రత్త వెరసి నిత్యం ఏదో ఒక మూల ప్రమాదం జరుగుతూనే ఉంది. రోడ్డు భద్రతా చర్యలు నామమాత్రంగా మారడంతో ప్రతిరోజూ ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఓఆర్‌ఆర్‌పై భద్రతా లోపాలకు ఇటీవల శంషాబాద్ ఎగ్జిట్ 16 వద్ద జరిగిన ఘోర ప్రమాదమే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. యాదగిరిగుట్టలో దైవ దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కన ఎలాంటి ప్రమాద సూచికలు లేకుండా నిలిపి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారులతో సహా ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది. ఇలాంటి హృదయ విదారక ఘటనలు ఈ మార్గంలో నిత్యకృత్యంగా మారాయి.

సగటున నెలకు నలుగురు..!

ఓఆర్‌ఆర్‌పై రోజుకు సగటున రెండు లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 80 శాతం కార్లు కాగా, 20 శాతం భారీ వాహనాలు ఉంటున్నాయి. రద్దీకి తగ్గట్టుగా భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ప్రమాదాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే భయానక వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గత ఐదేళ్ల వ్యవధిలో ఈ హైవేపై జరిగిన వివిధ ప్రమాదాల్లో ఏకంగా 369 మంది ప్రాణాలు కోల్పోగా.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 185 మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక కేవలం ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ నాటికి చూసుకుంటే.. 76 ప్రమాదాలు జరగ్గా 37 మంది మృత్యువాత పడ్డారు. మరో 80 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సగటున నెలకు నలుగురు ప్రాణాలు వదులుతున్నా, రోడ్డు మీదున్న డేంజర్ స్పాట్స్‌ను గుర్తించి సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఒక్క 144.5 కిలోమీటరు మైలురాయి వద్దే ఇప్పటివరకు ఏడు మరణాలు నమోదు కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

నిబంధనలు పట్టని వాహనదారులు..

ఈ హైవేపై జరుగుతున్న ప్రమాదాలకు 70 శాతానికి పైగా అతివేగమే ప్రధాన కారణం కాగా దీనికి తోడు ఎక్స్‌ప్రెస్‌వే నిబంధనలకు విరుద్ధంగా లారీలు, ఇతర భారీ వాహనాలను ఏమాత్రం భద్రతా సూచికలు లేకుండా రోడ్డుపైనే నిలపడం మృత్యు శాసనంగా మారుతోంది. వాహనాలు బ్రేక్‌డౌన్ అయినప్పుడు కనీస సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, సేఫ్టీ కోన్స్ లేకుండా సెంట్రల్ మీడియాన్ వద్ద పనులు చేపట్టడం, రాత్రి వేళల్లో తగినంత లైటింగ్ లేకపోవడం వంటి నిర్వహణ లోపాలు ప్రమాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. పరిస్థితి చేయిదాటుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడటం, అలసటతో నిద్రమత్తులో వాహనం నడపడం, రాంగ్ రూట్‌లో రావడం వంటి మానవ తప్పిదాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించేటప్పుడు నిర్ణీత వేగ పరిమితిని, లేన్ నిబంధనలను విధిగా పాటించాలని, కారులో ఉన్నవారంతా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రమాదాలను నివారించాలి - జి. సంతోశ్‌రెడ్డి.. ట్యాక్సీ డ్రైవర్

‘ప్రభుత్వం కేవలం టోల్ వసూళ్లపైనే కాకుండా ప్రమాదాల నివారణపై పటిష్ట చర్యలు తీసుకున్నప్పుడే ఈ నెత్తురు ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది. లేనిపక్షంలో మృత్యు కారిడార్‌గా మారిన ఓఆర్‌ఆర్.. మరింత మందిని బలితీసుకునే ప్రమాదం ఉంది.’

రూల్స్‌పై కఠినంగా ఉండండి : డీజీపీ సీవీ ఆనంద్

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాహనాల వేగాన్ని కచ్చితంగా నియంత్రించడంతోపాటు భద్రతా ప్రమాణాల అమలులో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతోందని, ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకూడదని స్పష్టం చేశారు.

Next Story