‘వాహన్ పోర్టల్’ సేవల్లో వేగం పెరిగింది: 89 వేల తాత్కాలిక రిజిస్ట్రేషన్లు పూర్తి

by Ramesh Naini |

తెలంగాణ రవాణా శాఖలో వాహన్ పోర్టల్ ద్వారా వాహన సేవలను వేగవంతం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు.

‘వాహన్ పోర్టల్’ సేవల్లో వేగం పెరిగింది: 89 వేల తాత్కాలిక రిజిస్ట్రేషన్లు పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా శాఖలో వాహన్ పోర్టల్ ద్వారా వాహన సేవలను వేగవంతం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మే 2వ తేదీ వరకు అందిన నివేదికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 89,392 తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) జరిగాయని ఆయన వెల్లడించారు. అలాగే 79,095 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించామని, ఇది మొత్తం దరఖాస్తుల్లో 88.5 శాతమని పేర్కొన్నారు. మరోవైపు ఫ్యాన్సీ నంబర్ల ప్రక్రియ కూడా పారదర్శకంగా సాగుతోందని, ఆన్‌లైన్ వేలం ద్వారా ఇప్పటివరకు 3,223 నంబర్లను వాహనదారులు రిజర్వ్ చేసుకున్నారని తెలిపారు.

శాశ్వత నంబర్ పొందిన వాహనాలకు డీలర్లు వెంటనే హెచ్‌ఎస్‌ఆర్‌పీ (హెచ్ఎస్ఆర్పీ) ప్లేట్లు బిగించి, ఆ ఫోటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, అప్పుడే రిజిస్ట్రేషన్ కార్డుల ప్రింటింగ్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కొత్త వ్యవస్థ కావడంతో ప్రారంభంలో ఉన్న వెరిఫికేషన్, ఇన్‌స్పెక్షన్ పెండింగ్‌ను నిరంతర సమీక్షల ద్వారా గణనీయంగా తగ్గించామని, ప్రస్తుతం ప్రతి లాగిన్‌లో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 25 లోపు మాత్రమే ఉందని వివరించారు. పౌర కేంద్రీకృత పాలన అందించేందుకు రవాణా శాఖ కట్టుబడి ఉందని, ఈ మార్పునకు సహకరిస్తున్న డీలర్లు, ప్రజలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story