- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం కమిషన్ ఎదుట తలోమాట.. కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?
కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఆనాడు కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవాలకు పొంతన కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఆనాడు కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవాలకు పొంతన కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే అంశంపై ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సమాధానాలు చెబుతున్నారనే విమర్శలొస్తున్నాయి. మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందని.. కాళేశ్వరం నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించిందని.. నాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఎదుట సమాధానం చెప్పారు. మరోవైపు మంత్రి తుమ్మల స్పందిస్తూ.. మంత్రుల సబ్ కమిటీకి, మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదన్నారు. సబ్ కమిటీలో తాను ఒక సభ్యుడిగా ఉన్నానని చెప్పిన ఆయన.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించారు.
పొంతన లేని సమాధానాలు..
2016 మార్చి 1న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. రెండు వారాల తర్వాత (2016 మార్చి 15న) రీ ఇంజినీరింగ్ ఆఫ్ ప్రాజెక్టులపై అధ్యయనానికి నాటి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధారాలతో సహా బయటపెట్టారు. తాజాగా కమిషన్ ఎదుట హాజరైన నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం పొంతనలేని సమాధానాలిచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీ డిజైన్‌లో భాగంగా కాళేశ్వరాన్ని నిర్మించామని, కేబినెట్ సబ్‌కమిటీ ఇందుకు నివేదిక ఇచ్చిందని ఓవైపు చెబుతూనే.. మరోవైపు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పడే నాటికే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన జీవో జారీ అయిందని చెప్పుకొచ్చినట్టు తెలిసింది. అదే నిజమైతే కేబినెట్ సబ్ కమిటీకి అనుగుణంగా ఎక్కడ నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ సూచన మేరకు మేడిగడ్డ స్థలాన్ని ఎంపిక చేసి ప్రాజెక్టు నిర్మించినట్టు కమిషన్ ఎదుట హరీశ్‌రావు వాంగ్మూలం ఇచ్చారు. కానీ, 2015 ఏప్రిల్ 2న మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్( డీపీఆర్)ను తయారు చేయాలని ఇరిగేషన్ విభాగం చీఫ్ ఇంజినీర్‌కు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాసినట్లు తెలిసింది.
ఎవరు నిజం చెప్పినట్లు?
2015 ఏప్రిల్ 13న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు డీపీఆర్ తయారు చేసే బాధ్యతను కన్సల్టెన్సీ కంపెనీకి అప్పగిస్తూ నాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే నిజమైతే సాంకేతిక బృందం సూచనల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీని ప్రభుత్వం నిర్మించిందని హరీశ్‌రావు చెప్పిన మాటలకు.. ప్రభుత్వ ఉత్తర్వులకు పొంతన లేకపోవటం గమనార్హం. మేడిగడ్డను నిర్మించాలని ముందుగానే నిర్ణయించుకున్న ప్రభుత్వం.. డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించిందని అర్థమవుతోంది. దీంతో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఎవరు నిజాలు చెబుతున్నారు? ఎవరు అబద్ధాలాడుతున్నారు? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (బుధవారం) కమిషన్ ఎదుట ఎలాంటి వాంగ్మూలం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలం మార్పు, డిజైన్లు, నాణ్యతా లోపం, నిర్వహణ లేకపోవటం, బ్యారేజీ కుంగటం.. కేబినేట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు ఆరోపణలు, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లుల చెల్లింపులు, వీటితో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ ఏం సమాధానమిస్తారనేది ఆసక్తి రేపుతోంది.






