- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎలుకల నివారణపై స్పెషల్ ఫోకస్ : డీఎంఈ నరేంద్ర కుమార్
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పూర్తి సురక్షితమైన, ఆరోగ్యకరమైన హీలింగ్ జోన్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు నరేంద్ర కుమార్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పూర్తి సురక్షితమైన, ఆరోగ్యకరమైన హీలింగ్ జోన్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, భద్రత, పెస్ట్ కంట్రోల్ కోసం ఇప్పటికే 'ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (ఐహెచ్ఎఫ్ఎంఎస్) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, మరింత పరిశుభ్రత కోసం ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్‌లో పలు మార్పులు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల ఓ హాస్పిటల్‌లో ఎలుకల సమస్య తలెత్తడంపై ఆయన స్పందించారు. ఆసుపత్రి సిబ్బంది చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రోగుల సహాయకులు వార్డుల్లో ఆహారం తినడం, మిగిలిన పదార్థాలను ఆవరణలో అశ్రద్ధగా పారవేయడం వల్లే ఎలుకల బెడద పెరుగుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో, సమస్య పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను, రక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఆసుపత్రి భవనాల్లోని పగుళ్లు, రంధ్రాలను ఎలుకలు చొరబడకుండా సిమెంట్, ఇతర దృఢమైన పదార్థాలతో శాశ్వతంగా మూసివేస్తున్నామన్నారు.
అత్యంత కీలకమైన ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, లేబర్ రూమ్‌లలో జీరో-గ్యాప్ విధానాన్ని పాటిస్తూ పూర్తి స్టెరిలైజేషన్ నిర్వహిస్తున్నామన్నారు. కిటికీలు, వెంటిలేటర్లు, డ్రైనేజీ పైపులు, డక్ట్‌లకు పటిష్టమైన వైర్ మెష్ లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వార్డుల్లో పేషెంట్ అటెండర్లు భోజనం చేయడంపై కఠిన నిషేధం విధిస్తున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని డీఎంఈ విజ్ఞప్తి చేశారు. రోగుల సహాయకులు నిర్దేశించిన క్యాంటీన్లలో మాత్రమే ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఆసుపత్రి అంతటా మూతలు కలిగిన చెత్త డబ్బాలను మాత్రమే వినియోగిస్తున్నామని, నిల్వ ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నామని డీఎంఈ వెల్లడించారు. ఈ వ్యవస్థను మానిటర్ చేసేందుకు సూపర్ వైజర్లను నియమిస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైకుల ద్వారా నిరంతర ప్రచారం, సైన్ బోర్డుల ఏర్పాటు జరుగుతోందన్నారు.
ఐహెచ్ఎఫ్ఎంఎస్ పరిధిలోని లైసెన్స్ పొందిన ఏజెన్సీల ద్వారా ఎలుకల బోనుల ఏర్పాటు, బేటింగ్ ప్రక్రియను క్రమం తప్పకుండా చేపడుతున్నామని, ఈ ప్రక్రియను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని డీఎంఈ వెల్లడించారు. ప్రతి ఆస్పత్రిలో 'హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ' (హెచ్ఐసీసీ) ద్వారా పెస్ట్ కంట్రోల్ లాగ్ బుక్‌ను నిర్వహిస్తూ, సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. "ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడం కేవలం అధికారుల బాధ్యతే కాదు, అది ప్రజల సామాజిక బాధ్యత కూడా. పేషెంట్ల వెంబడి వార్డుల్లో ఎక్కువ మంది ఉండడం, అక్కడే భోజనం చేయడం పేషెంట్‌కు మంచిది కాదు. మిగిలిన ఆహారాన్ని, పండ్లను ఎక్కడపడితే అక్కడ పారవేయడం వల్ల కీటకాలు, ఎలుకల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆసుపత్రి నిబంధనలు పాటించి యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయంలో మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలి" అని డీఎంఈ విజ్ఞప్తి చేశారు.






