- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూ ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతి.. అధికారులతో స్పెషల్ సీఎస్ సమీక్ష
ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణ పనుల పరిధిలో గుర్తించిన 56 నిర్మాణాలను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిగా తొలగించాలని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణ పనుల పరిధిలో గుర్తించిన 56 నిర్మాణాలను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిగా తొలగించాలని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. వీటిని తొలగిస్తే నిర్మాణ పనులకు ఆటంకాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. గోషామహల్‌లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతానికై సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆయన నిర్మాణ పనుల పురోగతి, రోడ్డు మౌలిక సదుపాయాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ పనులు చేపట్టిన అన్ని శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. స్పెషల్ సీఎస్ ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి 56 నిర్మాణాలను పూర్తిగా తొలగించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
జనవరి 10 నాటికి పూర్తి డ్రాయింగుల షెడ్యూల్..
దీనివల్ల ఆసుపత్రి నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయని వెల్లడించారు. ఇంతకు ముందు పోలీస్ శాఖ పరిధిలో ఉండి, అనంతరం డీఎంఈకి బదిలీ అయిన భూమికి సంబంధించి భూ ఉపయోగ మార్పు అంశంలో ఎంఏ అండ్ యూడీ శాఖ నుంచి అవసరమైన ఎన్‌ఓసీ జారీ పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. ప్రాజెక్టు కన్సల్టెంట్లు, 2026 జనవరి 10 నాటికి పూర్తి డ్రాయింగుల షెడ్యూల్‌ను సమర్పిస్తామని, ఆమోదించిన కాలపరిమితి ప్రకారం పనులు కచ్చితంగా చేపడతామని హామీ ఇచ్చారు. నీటిపారుదల శాఖ సమర్పించిన ప్రస్తుత నాలా డిజైన్‌ను సమీక్షించిన అనంతరం, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్)కు వెంటనే పనులు ప్రారంభించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
తక్షణమే డిజైన్ సిద్ధం చేయాలి
రోడ్డు మౌలిక సదుపాయాల విషయంలో ప్రతిపాదిత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్‌ఓబీ)కు తక్షణమే డిజైన్ సిద్ధం చేయాలని, ఆసుపత్రి ఎంట్రన్స్ రోడ్డులో ట్రాఫిక్‌కు ఆటంకంగా మారిన మ్యాన్‌హోల్‌ను సరిచేయాలని, పరిసర రోడ్ల అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు నిర్ణీత కాలపరిమితిలో పూర్తి అయ్యేలా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను సమాంతరంగా చేపట్టాలని సంబంధిత శాఖలకు వికాస్ రాజ్ సూచించారు.






