99 రోజుల యాక్షన్ ప్లాన్.. జీహెచ్ఎంసీ అధికారులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశం

by Ramesh Naini |

99 రోజుల యాక్షన్ ప్లాన్.. జీహెచ్ఎంసీ అధికారులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 99 రోజుల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ ను రిజల్ట్ ఓరియెంటెడ్‌గా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ జీహెచ్ఎంసీ అధికారులకు కర్తవ్యబోధ చేశారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో జయేశ్ రంజన్ అధ్యక్షతన మొట్టమొదటి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 14 వారాల పాటు జరగనున్న ఈ కార్యక్రమం ఒక్కో వారం ఒక్కో థీమ్ తో జరుగుతుందన్నారు. పారిశుద్ధ్యంతో మొదటి వారం ప్రారంభమై విద్య, వైద్యం, మహిళా, రైతు, యువత, పర్యావరణం తదితర థీమ్ లతో జరగనుందని తెలిపారు. మొదటి వారం పారిశుద్ధ్యం పేరుతో జరిగే కార్యక్రమంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‌ల పై ప్రత్యేక దృష్టి సారించి తొలగించాలన్నారు. ఇష్టారీతిన చెత్తను వేసే వారిపై జరిమానాలు విధించడం, ఈ - వేస్ట్ సేకరణ, చెరువులు, సరస్సులలో స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌ల సహకారంతో గార్బేజ్ తొలగించడం, టెక్స్టైల్ వేస్ట్ ను సేకరించడం వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రభావంతంగా చేపట్టాలన్నారు.

అంతర్గతంగా కార్యాచరణ సిద్ధం చేయాలి

యూత్ వీక్‌లో యువతలో నైపుణ్యాల అభివృద్ధి పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యాంటీ డ్రగ్ చైతన్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 99 రోజుల పాటు కార్యక్రమాలను చేపట్టేలా అంతర్గతంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం బాగా జరిగేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. రెండు రోజుల్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జీహెచ్ఎంసీకి చెందిన అస్సెట్‌లు, లయబిలిటీ మూడు కార్పొరేషన్లకు పంపిణీ చేసే ప్రక్రియను పూర్తి చేసి రిపోర్టు అందించనుందని జయేశ్ రంజన్ తెలిపారు.

30 అంశాలకు ఆమోదం..

జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిటీ సమావేశం 30 అంశాలకు ఆమోదం తెలిపింది. ఎక్కువగా రోడ్ల నిర్మాణ పనుల కోసం భూసేకరణ అంశాలు ఉన్నాయి. పాతబస్తీలోని ఖిల్వత్ స్థలంలో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బతుకమ్మకుంట పార్క్‌కు ‘వి. హనుమంతరావు బతుకమ్మకుంట’గా నామకరణం, సీఆర్‌ఎంపీ ఫేజ్-II కింద రోడ్ల అభివృద్ధికి పరిపాలనా అనుమతి. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లకు తలా రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలను సమావేశం ఆమోదించింది. దీంతోపాటు జీహెచ్‌ఎంసీ, మల్కాజ్ గిరి సైబరాబాద్ కార్పొరేషన్ల ఆదాయాలు-ఖర్చులు తాత్కాలికంగా జీహెచ్‌ఎంసీ జనరల్ ఫండ్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్, అదనపు కమిషనర్ లు సత్యనారాయణ, జోనల్ కమిషనర్‌లు కమిషనర్‌లు ప్రియాంక అలా, మందా మకరందు, జి ముకుంద రెడ్డి, కే ఏ.మంగతాయారు, ఎస్.శ్రీనివాసరెడ్డి, చంద్రకళ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, ఎస్ఈ జ్యోతిర్మయి, సీసీపీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story