కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు స్పెషల్ అసెంబ్లీ సెషన్స్.. గులాబీ బాస్ హాజరవుతారా?

by Kema Shiva Kumar |

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు నిర్వహించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? అనే చర్చ సర్వత్రా మొదలైంది.

కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు స్పెషల్ అసెంబ్లీ సెషన్స్.. గులాబీ బాస్ హాజరవుతారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు నిర్వహించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదాలో ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అలాగే సభలో జరిగిన ఏ చర్చల్లోనూ పాల్గొనలేదు. దీనితో అసెంబ్లీ అటెండెన్స్ కోసం మాత్రమే ఆయన వచ్చివెళ్లారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ తనను దోషిగా చిత్రించిన కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై జరిగే ప్రత్యేక సెషన్ కు వస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌పై విమర్శల దాడి

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రతిపక్షనేత కేసీఆర్ ను నిండు సభలో దోషిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం స్ట్రాటజీ రచిస్తున్నది. ఇంతకాలం కేవలం రాజకీయ విమర్శలు చేసిన రూలింగ్ పార్టీ ఇకపై కమిషన్ ఇచ్చిన నివేదికను ఆస్త్రంగా చేసుకుని, కేసీఆర్, హరీశ్ రావులపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. ఆ ఇద్దరి కారణంగానే అవినీతి జరిగిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శల దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇంతలో కమిషన్ రిపోర్టు పారదర్శంగా లేదని, రాజకీయ కక్ష సాధింపు కోసమే అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ విమర్శలు మొదలుపెట్టింది. అయితే ఆ విమర్శలకు సభలోనే కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.

సభను ఫేస్ చేయగలారా?

ఒకవేళ అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ఘోష్ రిపోర్టుపై మాట్లాడుతారా? ఆ రిపోర్టును మొత్తం తప్పు అంటారా?లేకపోతే కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదని ఏ విధంగా వాదిస్తారు?అనే చర్చ జరుగుతోంది. నిజానికి కేసీఆర్ సభకు రావాలని, చర్చల్లో పాల్గొనాలని అధికార పార్టీ సభ్యులే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఆయన ప్రతిపక్ష హోదాలో ఏ విధంగా మాట్లాడుతారు? అధికార పార్టీ నుంచి వచ్చి రన్నింగ్ కామెంట్స్ కు ఏ విధంగా స్పందిస్తారు? అనేదాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చాక డేట్స్ ఫైనల్

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం, మంత్రులు ఢిల్లీలో నిరసనల దీక్షలకు వెళ్లారు. ఈనెల 7న వారు తిరిగి వచ్చిన తరువాత అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారుచేసే అవకాశం ఉంది. అగస్టు 11 నుంచి 14 తేదీల్లోపు రెండు రోజుల పాటు సభ జరిగే చాన్స్ ఉందని, లేకపోతే పంద్రాగస్టు తరువాతే సమావేశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Next Story