పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ.. ఆ ఐదుగురి భవితవ్యంపై సస్పెన్స్

by Kema Shiva Kumar |

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ.. ఆ ఐదుగురి భవితవ్యంపై సస్పెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తీర్పు ఇచ్చారు. అయితే మరో ఐదుగురు పోచారం శ్రీనివాస్​రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మిగతా వారిపై నిర్ణయం ప్రకటించకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్​ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. వారిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డిపై గురువారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వీరి ముగ్గురిపై కూడా బుధవారం ఇచ్చిన తీర్పు తరహాలో ఉంటుందని కాంగ్రెస్​వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరు పార్టీ మారలేదని, వారిపై ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. అయితే కడియం శ్రీహరి గతంలో కొంత సమయం కావాలని కోరారు. ఆయన కూడా పార్టీ మారలేదని స్పీకర్ కు సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని, తాను పార్టీ మారానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని స్పీకర్‌కు కడియం శ్రీహరి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఆయనపై పిటిషన్​ఇచ్చిన వారి సమక్షంలో ఇంకా విచారణ జరగలేదు. దీంతో పూర్తి విచారణ, క్రాస్​ ఎగ్జామినేషన్ ​పూర్తయిన తర్వాతే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇవేవీ జరగకుండా నేరుగా నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని గుర్తుచేస్తున్నారు.

వేటు వేస్తారా?

గతంలో కడియం శ్రీహరి స్పీకర్​ను కొంత సమయం కావాలని ఆయన కోరారు. అందుకు అనుగుణంగా ఆయనకు సమయమిచ్చారు. దీంతో కడియంపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్​బీ ఫామ్ పై సికింద్రాబాద్​ఎంపీగా పోటీ చేసినందున ఆయన పార్టీ మారలేదనడానికి ఆస్కారం లేదు. దీంతో దానంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయమై ఉత్కంఠ నెలకొంది. అనర్హత వేటు వేస్తే ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి తిరిగి పోటీచేస్తారని పెద్దఎత్తున ప్రచారం సాగింది. కానీ ఆయన ఇంత వరకు రాజీనామా చేయలేదు. స్పీకర్ కు సమాధానం ఇవ్వలేదు.

అనర్హత పిటిషన్లపై విచారణ

తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన పుష్కరకాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారినా వారిపై వేటు వేయలేదు. అనర్హత పిటిషన్లను విచారించ లేదు. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ మారిన వారిపై స్పీకర్​నిర్ణయాన్ని తీసుకున్నారని నేతలు గుర్తుచేస్తున్నారు. స్పీకర్​నిర్ణయాన్ని చారిత్రక సందర్భంగానే వరిగణిస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్, నేటి బీఆర్ఎస్​ఎంపీ కేఆర్​సురేశ్​రెడ్డి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అనేక మంది పార్టీ ఫిరాయించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.

Next Story