కీలక పరిణామం.. దానం నాగేందర్‍కు స్పీకర్ నోటీసులు

by Prasad Jukanti |

పార్టీ ఫిరాయింపు అంశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తో పాటు పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటిీసులు జారీ చేశారు.

కీలక పరిణామం.. దానం నాగేందర్‍కు స్పీకర్ నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‍కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఫిర్యాదులు అందగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ లకు సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు.

స్పీకర్ కు సుప్రీం నోటీసులు:

అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించారు అనడానికి బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదనే చర్చ జరుగుతోంది. స్పీకర్ చర్యలు తీసుకోకముందే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ కు వెళ్తారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story