సెంట్రల్ ​అసెంబ్లీలో భగత్​సింగ్​ బాంబులు వేసినప్పుడు చైర్​లో ఉన్నది ఆయనే: స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-25 16:42:11  IST  )

విఠల్ బాయి పటేల్ ​స్పీకర్ గా ఉన్నప్పుడే 1929లో భగత్ సింగ్, భటెకేశ్వర్ దత్ వలస పాలనను వ్యతిరేకిస్తూ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరిన సంఘటన జరిగిందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్ తెలిపారు.

సెంట్రల్ ​అసెంబ్లీలో భగత్​సింగ్​ బాంబులు వేసినప్పుడు చైర్​లో ఉన్నది ఆయనే: స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : విఠల్ బాయి పటేల్ ​స్పీకర్ గా ఉన్నప్పుడే 1929లో భగత్ సింగ్, భటెకేశ్వర్ దత్ వలస పాలనను వ్యతిరేకిస్తూ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరిన సంఘటన జరిగిందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్ తెలిపారు. ఆ సమయంలో చైర్ లో ఉన్న విఠల్ బాయి పటేల్ సభ్యులు ఆందోళనకు గురవ్వకుండా సమయస్పూర్తిగా వ్యవహరించారన్నారు. 1925లో భారతదేశ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్ బాయి పటేల్ సంస్మరణ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో భాగంగా సోమవారం గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ 1925లో బ్రిటీష్ వలస పాలనలో భారతీయుడైన విఠల్ బాయి పటేల్ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికవడం మామూలు విషయం కాదన్నారు.

విఠల్ బాయి పటేల్ దైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, సెంట్రల్ అసెంబ్లీని సమర్ధవంతంగా నడిపించిన తీరు నాటి నుండి నేటి వరకు అసెంబ్లీ స్పీకర్లకు మార్గదర్శకంగా ఉన్నదన్నారు. తన నిర్ణయాలను తెలియజేయడంలో విఠల్ బాయి పటేల్ నిక్కచ్చిగా వ్యవహరించేవారని, ప్రపంచ దేశాల నాయకులతో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి మద్దతుగా బోస్-పటేల్ మేనిఫేస్టో ను దైర్యంగా ఆయన ఆవిష్కరించారన్నారు. భారతదేశ లేజిస్లేటివ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు విఠల్ బాయి పటేల్ దని, విఠల్ బాయి పటేల్ న్యాయవాద వృత్తిలో కొనసాగి, తదుపరి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని ప్రసాద్​కుమార్ తెలిపారు. రాష్ట్రాల శాసన సభాపతులుగా విఠల్ బాయి పటేల్ ఘనమైన వారసత్వాన్ని, విలువలను కొనసాగించాలని, విఠల్ బాయిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రజస్వామ్య పద్దతిలో ప్రజల సంక్షేమానికి అనుగుణంగా పనిచేస్తున్నదన్నారు. అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్షాల సభ్యులు కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నామని గడ్డం ప్రసాద్ ​కుమార్​ చెప్పారు.

Next Story