కీలకంగా చర్లపల్లి టెర్మినల్.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో రైళ్ల అనుసంధానాన్ని మెరుగుపరచడంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ కీలకంగా మారనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు.

కీలకంగా చర్లపల్లి టెర్మినల్.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో రైళ్ల అనుసంధానాన్ని మెరుగుపరచడంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ కీలకంగా మారనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్ డివిజన్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు, నగర శివార్ల నుంచి రైలు ప్రయాణాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రూ.413 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ టెర్మినల్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్ల కోసం ఏర్పాటు చేసిన కొత్త రన్నింగ్ రూమ్, క్రూ బుకింగ్ లాబీని జీఎం ప్రారంభించారు.

కంప్యూటరైజ్డ్ బెడ్ ఆక్యుపేషన్, మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతి, ఎయిర్ కండిషనింగ్, యోగా-ధ్యానం గదులు, మాడ్యులర్ కిచెన్, ఆర్‌ఓ ప్లాంట్, సీసీటీవీ వంటి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. క్రూ లాబీలో క్రూ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సీటింగ్, వంటగది ఏర్పాట్లను సమీక్షించారు. చర్లపల్లి స్టేషన్‌లోని ఐఓహెచ్ (ఇంటర్మీడియట్ ఓవర్‌హాలింగ్ షెడ్)ను తనిఖీ చేసి, కోచ్ నిర్వహణ సదుపాయాలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. షెడ్‌లో ఉన్న ఖాళీ అమృత్ భారత్ రైలు రేక్‌లోని కొత్త సౌకర్యాలను పరిశీలించారు. ప్లాట్‌ఫామ్ నంబర్-1 వద్ద ప్రతిపాదిత కొత్త ఎంట్రీ అలైన్‌మెంట్, అప్రోచ్‌ను కూడా జీఎం పరిశీలించారు.

Next Story