Ponguleti: మరో 15 రోజుల్లో కొత్త అధికారులు.. భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-04-18 08:03:20  IST  )

ధరణితో ఇబ్బందులు పడిన వారికి సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి అన్నారు.

Ponguleti: మరో 15 రోజుల్లో కొత్త అధికారులు.. భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ హాయంలో చుట్టం అనుకున్న చట్టం రైతులకు, పేదలకు శత్రువుగా తయారయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలిక ఊడిన చందంగా బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణితో రైతుల సమస్యలు పెరిగాయన్నారు. అందుకే పేదల కన్నీటిని తుడిచేందుకు భూభారతి తీసుకువచ్చాం. ధరణిని తీసుకువచ్చిన మూడేళ్లలోనే ప్రజలు విసిగివేసారిపోయారని ఇప్పుడు ఆ చట్టం లేకుండా పోయిందన్నారు. రైతులు ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. వందేళ్లకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఇవాళ ములుగు జిల్లా వెంకటాపూర్ లో భూభారతి రెవెన్యూ సదస్సును ప్రారంభించిన పొంగులేటీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేరు చెబితే కొంత మంది గుండెళ్లో రైల్లు పరిగేత్తుతాయన్నారు. ప్రజలు రెండు సార్లు చెంపచెల్లుమనిపించినా బీఆర్ఎస్ నేతలు తాము ధరణి ద్వారా ఏం తప్పులు చేశామో గ్రహిచలేకపోతున్నారని, ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబితే దాన్ని నమ్మిన ప్రజలు, రైతులు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని అయినా ఆనాటి పాలకులు, ఈనాటి ప్రతిపక్ష నాయకులకు ఇంకా జ్ఞానోదయం కాలేదని విమర్శించారు. భూభారతి బిల్లును తీసుకువస్తున్నసమయంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వీధుల్లో రౌడీల్లా వ్యవహరించారని దుయ్యబట్టారు.

ఏనాడైనా రెవెనన్యూ సదస్సులు నిర్వహించారా?

2020 లో చట్టం చేశాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైనా ఇలాంటి రెవెన్యూ సదస్సు నిర్వహించారా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఉంటే ప్రజల బాధలు మీకు తెలిసేవన్నారు. కనీసం ప్రజల బాధలు తెలుసుకునేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించని మీరు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనుకుంటే ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. సాధాబైనామా పెట్టుకోమని చెప్పి చట్టంలో మాత్రం సాధాబైనామా అంశాన్ని ఎత్తేసి నిరుపేద రైతులను మభ్యపెట్టారు. భూ సమస్యలకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లోని న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో పరిష్కరించేవిధంగా ఈ కొత్త భూభారతి చట్టంలో అవకాశం కల్పించామన్నారు. ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో వారికే పట్టాపాసుబుక్కు ఇస్తామన్నారు. ఇకపై పేదలెవరూ చెప్పులు అరిగేవరకు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదని ఏ మహిళ తన మంగళసూత్రాలు అమ్మి కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ గ్రామానికే రెవెన్యూ అధికారులు వచ్చి మీ భూసమస్యలు పరిష్కరించేలా కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారిస్తారన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చినట్లుగా నాలుగు గోడల మధ్య కూర్చుని భూభారతి చట్టాన్ని తీసుకురాలేదని ప్రజలతో చర్చించి తీసుకువచ్చామన్నారు. ఈ చట్టం సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారుల కోసమో కాదు. ప్రజల కోసం తీసుకుచ్చిన చట్టం అన్నారు.

మరో 15 రోజుల్లో రెవెన్యూ అధికారులు:

కేసీఆర్ ధరణిలో పార్ట్-బి తీసుకువచ్చారు. దీని కింద 18 లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి. తనను ఎవరైతే కలుస్తారో వారి భూములను పార్ట్-బి నుంచి తీశారని ఆరోపించారు. కానీ భూభారతి చట్టం ద్వారా పార్ట్-బి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. తాము చెప్పిన వారికి భూమి బదలాయించలేదనే ఓ వీఆర్వోపై కోపంతో అర్థరాత్రి కేసీఆర్ 23 వేల మంది వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని నడిరోడ్డుపై వదిలేశారన్నారు. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఓ అధికారి ఉండాలనే ఆనాడి దొరకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందన్నారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవారికి రెవెన్యూ సమస్య వస్తే అండగా ఉండి వారి భూసమస్యను పరిష్కరించేదుకు రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులను నియమించాలని నిర్ణయించామన్నారు. మరో 10-15 రోజుల్లో మీ గ్రామాలకు రెవెన్యూ అధికారులు రాబోతున్నారని చెప్పారు. గతంలో తన సొంత భూమి మరొకరి పేరుతో నమోదు అయితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. కానీ మేము తెచ్చిన చట్టం ప్రకారం అధికారులు ఎవరైనా తప్పు చేస్తే పై అధికారికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్లు తప్పు చేస్తే ట్రిబ్యనల్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అబాదీ భూముల్లో ఇళ్లు కట్టుకున్నప్పటికీ వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు లేవని వాటికి ఈ భూభారతి చట్టంలో పరిష్కారం చూపిస్తామన్నారు. అర్హులైన 6 వేల మంది సర్వేయర్లకు లైసెన్స్ ఇచ్చి క్షేత్రస్థాయికి పంపబోతున్నామని చెప్పారు.

Next Story