రేవంత్ వ్యాఖ్యలకు సమాజం తలదించుకుంటుంది: ఎంపీ ఈటెల

by Ramesh Goud |   (  Updated:2025-05-06 16:14:12  IST  )

సీఎం రేవంత్​రెడ్డి అప్పులు పుట్టడం లేదనే వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం తలదించుకుంటుంది.

రేవంత్ వ్యాఖ్యలకు సమాజం తలదించుకుంటుంది: ఎంపీ ఈటెల
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ ​రెడ్డి అప్పులు పుట్టడం లేదనే వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం తలదించుకుంటుంది. దేశంలో మన పరువుపోయిందని ఎంపీ ఈటెల రాజేందర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పాలించక చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు పలికిన ప్రగల్భాలు, ఇచ్చిన హామీలు తాను నెరవేర్చలేనని బేషరతుగా చెప్పులన్నారు. ముక్కు నేలకు రాసి తప్పుకో చేతనైన నాయకులు పాలిస్తారని సిగ్గుమాలిన పద్ధతిలో అలానే కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని పేర్కొన్నారు. రేవంత్​ ను గెలిపించిన ఖర్మానికి అప్పటివరకు భరించక తప్పదన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు భయపడేవారు కాదని, ప్రేమకు లొంగుతారు కానీ బెదిరింపులకు కాదన్నారు. మాయచేసుడు మంత్తరించుడు తెలంగాణ ప్రజల రక్తంలో ఉండదు, ఎస్మా ప్రయోగించిన వారి గతమేయ్యిందో తెలుసుకోవాలని చురుకలు వేశారు. 2014 లో రూ. 30 వేల కోట్ల ఓన్ టాక్స్ రెవెన్యూ ఉన్న రాష్ట్రం 11 ఏళ్లలో లక్ష 30 వేల కోట్ల ఆదాయంకు చేరుకుంది అంటే ఇది దివాలా రాష్ట్రం ఏట్లా అవుతుందన్నారు. లక్షకోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్లకు పెరగడం దివాలా కాదనే సంగతి తెలుసుకోవాలన్నారు. సీఎం సిగ్గు మాలినతనానికి, బుద్ధిలేనితనానికి, అనుభవలేమికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇంత చేతకానితనంతో ఎందుకు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు వేయమని అడిగారని నిలదీశారు.

నిజాం కాలం నాడే సన్న వరి తిన్న రాష్ట్రంగా పేరొంది..

తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు.. తెలంగాణ పేదరికంలో ముంచబడింది. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ, రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టిన చెరువులతో దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్న అన్నం తినే ప్రాంతంగా వెలుగొందిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి 50 శాతం పైబడి ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిని, పార్టీని దృష్టిలో పెట్టుకుని దివాళా తీసిందని పదేపదే చెబుతూ ఆయన దివాళాకోరుతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, మాటల్లో, చేతల్లో గంభీరత లేని రేవంత్ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాళాకోరు రాష్ట్రంగా తెలంగాణ ప్రజలను ఎందుకు పనికిరానివారుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం రూ. 3 లక్షల 4 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏవిధంగా దివాళా తీసిన రాష్ట్రం అవుతుందన్నారు.

తెలంగాణ సమాజం కుంగిపోవద్దు..

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2015లో ప్రవేశపెట్టినప్పుడు వచ్చిన ఆదాయం కేవలం రూ. 73వేల కోట్లు. ఇవాళ జీఎస్టీలో వస్తున్న ఆదాయం రూ. 2 లక్షల 40 వేల కోట్లుగా ఉంది. జీఎస్టీలో స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ ఉంటుంది. 2014 -15లో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన తెలంగాణలో 11 సంవత్సరాల కాలం తర్వాత భట్టి విక్రమార్క ప్రవేపెట్టిన బడ్జెట్ రూ. 3 లక్షల 4 వేల కోట్లుగా ఉంది. మరి రాష్ట్రం పురోగమిస్తున్నట్లా అభివృద్ధి చెందుతున్నట్లా, దివాళా తీస్తున్నట్లా గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. రూ. 9 వేల కోట్ల అప్పు పుట్టేందకు అర్హత ఉన్న రాష్ట్రంలో కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే రూ. 64 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నరంటే పతార ఉన్నట్లా, లేనట్లా చెప్పాలని డిమాండ్​చేశారు. మొత్తం దేశంలో జీఎస్డీపీ తెలంగాణ రాష్ట్రం 14 శాతంగా ఉంది. 2025-26 కి రూ. 18 లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుందని అంచనా వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో అధికారం ఇస్తే ఇలానే ఖతం పట్టించారని తెలంగాణలో కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ని ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడటం ఇదే ఆదర్శమా అంటూ మండిపడ్డారు.

Next Story