- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్ల.. నేను వెళ్లను! ఐఏఎస్ ఆఫీసర్ల విముఖత
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు జంకుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు జంకుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జిల్లాల్లో చాలా స్ట్రాంగ్ ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగిన వెంటనే ప్రశ్నించేందుకు గులాబీ లీడర్లు రెడీగా ఉంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగంపై అధికార కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లు బలంగా ఉంటాయని టాక్ ఉంది. దీంతో ఆ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసేందుకు ఐఏఎస్ లు ముందుకు రావడం లేదు. నెలరోజుల క్రితం కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఆ సమయంలో సెక్రటేరియట్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిణి హరితను సిరిసిల్ల కలెక్టర్ గా నియమించారు. కానీ ఆమె అక్కడికి వెళ్లి జాయిన్ అయిన కొన్ని రోజులకే చైల్డ్ కేర్ లీవ్ పై వెళ్లారు.
అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే రాజకీయ కారణాల రీత్యా అక్కడ పనిచేసేందుకు హరిత విముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. నియామకం సమయంలోనే ఆమె ఆ జిల్లాకు బదులుగా మరో జిల్లా బాధ్యతలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఆ జిల్లాకు వెళ్లాలని పై అధికారులు సూచించడంతో సరే అని ఒప్పుకున్న హరిత నాలుగైదు రోజుల పాటు మాత్రమే పనిచేసి సెలవుపై వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతున్నది. అందుకు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తున్నది.
పనిచేసిన సందీప్ కుమార్ ఝా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జరిగిన జాతీయ జెండావిష్కరణ కార్యక్రమానికి సందీప్ కుమార్ ఝా ఆలస్యంగా వచ్చారు. దీంతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆయనపై ఫిర్యాదు చేయడంతో సందీప్ ను కలెక్టర్ పోస్టు నుంచి తప్పించి హరితను నియమించారు. ఇప్పుడా ఆమె లాంగ్ లీవ్ లో ఉండటంతో ఇన్ చార్జి కలెక్టర్ గా గరీమా అగ్రవాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలో జరిగే ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ఆమెకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడమా? లేక కొత్తవారిని అపాయింట్ చేయడమా? అనే చర్చ ప్రభుత్వ అధికార వర్గాల్లో నడుస్తున్నది.






