CM కేసీఆర్ మర్చిన హామీలపై ఇక ఉద్యమమే: సింకారు శివాజీ

by Disha Web Desk 19 |
CM కేసీఆర్ మర్చిన హామీలపై ఇక ఉద్యమమే: సింకారు శివాజీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో శివసేన జెండా ఎగరాలనీ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు వెళ్లమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ఉద్యమం చేస్తామని ప్రకటించారు.

శుక్రవారం ఆయన మహారాష్ట్ర, ముంబైలోని బాల సాహెబ్ భవన్‌‌లో శివసేన జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, శివసేన పార్టీ బలోపేతంపై రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించినట్లు శివాజీ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించి కమిటీలు వేసి, కార్యకర్తల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జాతీయ నాయకులు సూచించారని అన్నారు.

త్వరలో శివసేన పార్టీ ఆధ్వర్యంలో విడతల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చర్చించడం జరిగిందన్నారు. పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషి అభినందనీయమని చర్చలో ఉన్న వారు అన్నట్టు వెల్లడించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలో శివ సేన పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

119 శాసనసభ స్థానాల్లో పార్టీ నుంచి అభ్యర్ధులు ఉంటారని మరోసారి స్పష్టం చేశారు. శివసేన ఇచ్చిన మాట తప్పకుండా ప్రకటించిన విధంగానే టికెట్లు కేటాయింపు ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతం కోసం శివ సైనికులు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశంలో శివసేన పార్టీ జాతీయ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్‌, పార్టీ జాతీయ కార్యదర్శి బాలీవుడ్ నటుడు, పార్టీ చిత్ర పరిశ్రమ అధ్యక్షుడు సుషాంత్‌ షేలర్, ఎంపీ భావన గావ్లీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed