పారదర్శకత, వేగవంతమైన అనుమతులకు సింగిల్ విండో సొల్యూషన్

by Yella Dhawani Reddy |

పారదర్శకత, వేగవంతమైన అనుమతులకు సింగిల్ విండో సొల్యూషన్ అందుబాటులోకి తెచ్చినట్లు పీఆర్‌జీఐ యోగేష్ బవేజా అన్నారు.

పారదర్శకత, వేగవంతమైన అనుమతులకు సింగిల్ విండో సొల్యూషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారదర్శకత, వేగవంతమైన అనుమతులకు సింగిల్ విండో సొల్యూషన్ అందుబాటులోకి తెచ్చినట్లు పీఆర్‌జీఐ యోగేష్ బవేజా అన్నారు. సోమవారం ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో వార్తలాప్ వర్క్‌షాప్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌జీఐ) యోగేష్ బవేజా మాట్లాడుతూ.. ప్రెస్ సేవా పోర్టల్‌ను సింగిల్ విండో సొల్యూషన్‌గా ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని, అనుమతులు వేగవంతం అవుతాయని, ప్రచురణకర్తలకు మరింత సౌలభ్యం కలుగుతుందని వివరించారు. పీఐబీ హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ సృతి పాటిల్ మాట్లాడుతూ తెలంగాణలో తొలిసారి ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్‌ నిర్వహించామని, ఇది ప్రచురణకర్తలకు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. పీఆర్‌జీఐ సహకారంతో త్వరలో ప్రచురణకర్తల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ అశుతోష్ మొహ్లే కొత్త చట్టంపై ప్రజెంటేషన్ ద్వారా ప్రచురణకర్తలకు అవగాహన కల్పించారు. 2024 మార్చి నుంచి రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతోందని, 60 రోజుల్లోగా స్పందన రాకపోతే దరఖాస్తులు డీమ్డ్ అప్రూవ్ గా పరిగణించబడతాయని ఆయన తెలిపారు. ప్రచురణకర్తలు ఏజెంట్ల సహాయం తీసుకోకుండా నేరుగా పీఆర్‌జీఐ పోర్టల్‌ వాడాలని ఆయన సూచించారు. ఎన్ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ శర్మ ప్రెస్ సేవా పోర్టల్‌ గురించి లైవ్ డెమో ద్వారా వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రచురణకర్తలు ఈ వర్క్ షాప్ లో పాల్గొని, వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణ కాంత్, మీడియా అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్లు గాయత్రి, శివచరణ్ రెడ్డి, ఐఅండ్‌పీఆర్‌ అధికారులు, రెండు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రచురణకర్తలు పాల్గొన్నారు.

Next Story