బోధన మల్టీపుల్.. టీచర్ సింగిల్..!

by Bhanu |

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయంటూ చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం

బోధన మల్టీపుల్.. టీచర్ సింగిల్..!
X

దిశ, నవాబుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయంటూ చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్న ఘటన నవాబుపేట మండలంలోని దొడ్డిపల్లిలో వెలుగు చూసింది. గురువారం ఈ పాఠశాల‌ను ‘దిశ’ ప్రతినిధి సందర్శించగా విద్యా వ్యవస్థ ఎక్కడ నిలిచిపోయిందో ప్రత్యక్షంగా తేలిపోయింది.

ఈ ప్రాథమిక పాఠశాలలో రెండు భవనాలున్నప్పటికీ మొత్తం ఐదు తరగతుల విద్యార్థులకు (దాదాపు 30 మంది) కేవలం ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తుండటం గమనార్హం. ప్రధానోపాధ్యాయుడు గంగ గంగాధర్ మెడికల్ లీవ్‌పై ఉండగా, మిగిలిన ఉపాధ్యాయుడు భాను ప్రసాద్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఐదు తరగతుల పిల్లలకు మూడు నుంచి నాలుగు సబ్జెక్టులను ఒకే గదిలో బోధించడం వల్ల విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్తే డిప్యూటేషన్‌ పైనైనా మరొకరిని పంపాల్సిన అవసరం ఉన్నా అధికారులు స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొని ఉందని గ్రామస్తులు అంటున్నారు. తక్షణమే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంది.

ఎంఈఓ స్పందన

ఈ అంశంపై స్పందించిన ఎంఈఓ నాగ్య నాయక్ మాట్లాడుతూ – ప్రధానోపాధ్యాయుడు మెడికల్ లీవ్‌లో ఉన్నందున మల్టీ టీచింగ్ పద్ధతినే అమలు చేస్తున్నామని, మండలంలో ఎక్సెస్ ఉపాధ్యాయులు లేకపోవడంతో డిప్యూటేషన్ కూడా సాధ్యపడడం లేదని చెప్పారు. అందుకే అదే ఉపాధ్యాయుడు బోధన కొనసాగిస్తున్నారని, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు.


Next Story