- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానివి పచ్చి అబద్ధాలు: మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం 1952 ప్రకారం ఒక న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమిస్తే

దిశ, తెలంగాణ బ్యూరో: కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం 1952 ప్రకారం ఒక న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమిస్తే ఆ కమిషన్ న్యాయవ్యవస్థలో భాగం కాదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసే తాత్కాలిక విచారణ సంస్థలు అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇవి నిర్దిష్ట విషయాలపై వివరాలను సేకరించి, నివేదికలను సమర్పించడానికి మాత్రమే ఏర్పాటు అవుతుంటాయని తెలిపారు. ఇవి కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలవని పేర్కొన్నారు. వీటిని మరిచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై పచ్చి అబద్ధాలు చెబుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని కుటిల ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కోర్టుల మాదిరిగా తీర్పులు ఇవ్వలేదని.. న్యాయస్థానాలకు ఉన్న అధికారాలు ఉండవని స్పష్టం చేశారు.
చరిత్రలో అనేక కమిషన్లను నియమించారని.. వాటి సిఫార్సులను పాక్షికంగా అమలు చేయడం తప్ప ఎక్కడా చర్యలు తీసుకున్నది లేదని పేర్కొన్నారు. ఘోష్ కమీషన్ పూర్తి నివేదిక బయటపెట్టకుండా 665 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి, కేసీఆర్ మీద బురదజల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక సుంకిశాల ఘటన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొడంగల్ ఎత్తిపోతల పనులు ఆయన కంపెనీకే ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో ఆర్థిక మంత్రిని కమిషన్ తప్పుపట్టినట్లు.. ఆర్థిక శాఖ కార్యదర్శిని ఎందుకు తప్పుపట్టలేదని నిలదీశారు. అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలను సరైనవి కావని పేర్కొన్నారు.






