సింగరేణి అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇప్పుడు ఇంటర్నేషనల్

by Gantepaka Srikanth |

సింగరేణి(Singareni) సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పలు పరిశోధనా సంస్థలతో కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటోంది.

సింగరేణి అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇప్పుడు ఇంటర్నేషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి(Singareni) సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పలు పరిశోధనా సంస్థలతో కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటోంది. సోమవారం నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర గనుల శాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ వారితో కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికి, విస్తరణ తదితర అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి సమాచారం అందించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిసి పనిచేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీఎండీ ఎన్.బలరామ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్(పీఅండ్ పీ) కె.వెంకటేశ్వర్లు, పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ అగ్నిహోత్రి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఒప్పందం ఉద్దేశాలను వివరించారు. సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టాలని నిర్ణయించిందని, వీటిలో కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పైన ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పరిశోధన రంగంలో దశాబ్దాల అనుభవం గల ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో సాంకేతిక సహాయం, పరస్పర సహకారంతో వ్యాపార భాగ్యస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు నిర్ణయించామన్నారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న జెఎన్ఏఆర్డీడీసీ సంస్థ అల్యూమినియం రంగంలోనూ, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కీలక ఖనిజాలపై పరిశోధనలు చేస్తూ పలు జాతీయ సంస్థలకు సాంకేతిక సహాయం అందిస్తోందని, అలాగే ఈ రంగాలలో వర్క్ షాపులు, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.

దేశంలోనే కాక విదేశాలలో కూడా సింగరేణి సంస్థ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో పరిశోధనలకు ఖనిజాల ఉనికి తదితర అంశాలు కచ్చితంగా నిర్ధారించుకోవడానికి ఈ పరిశోధన సంస్థ సహకారాన్ని తీసుకుంటామన్నారు. సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో లభ్యమయ్యే ఓవర్ బర్డెన్ లో, ఎస్టీపీపీలోని ఫ్లైయాష్‌లో సింగరేణి సమీప ప్రాంతాల్లోని గుట్టల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికి ప్రాథమికంగా నిర్ధారించబడిందని, దీనిపై లోతుగా పరిశీలించడానికి ఈ సంస్థ సహకారం తీసుకుంటామన్నారు. భూ విజ్ఞాన శాస్త్రం, ఖనిజ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి , శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. వారి పరిశోధన శాలలను కూడా వినియోగించుకోవడానికి వీలుంటుందన్నారు.

ఈ సందర్భంగా పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. సింగరేణి తో ఒప్పందం కుదరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సింగరేణికి మైనింగ్‌లో అపారమైన అనుభవం ఉందని, ఈ అనుభవంతో కీలక ఖనిజ రంగంలోనూ కచ్చితంగా రాణించగలదని అభిప్రాయపడ్డారు. తమ ఒప్పందం పరస్పరం లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, శ్రీ తిరుమలరావు, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, జీఎంలు రాందాస్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Next Story