- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సింగరేణి కీలక నిర్ణయం.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా
ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. సింగరేణి సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్ అండ్ ఫైనాన్సు గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది.
2024 లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేస్తోంది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా రూ.10 లక్షల బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలలో రూ.10 లక్షల బీమా పాలసీ కోసం కనీసం రూ.5 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి కూడా బీమా పథకాన్ని అమలు జరిపింది. కాగా సింగరేణి సంస్థలో కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేస్తున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింప జేసే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటోందని అధికారులు తెలిపారు.






