సింగరేణి సంసిద్ధంగా ఉంది.. CMD బలరామ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

దేశ అవసరాలు, వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి స్వయంగా కానీ ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్‌గా కానీ ప్రవేశించడానికి సంసిద్ధంగా ఉందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు.

సింగరేణి సంసిద్ధంగా ఉంది.. CMD బలరామ్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ అవసరాలు, వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి స్వయంగా కానీ ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్‌గా కానీ ప్రవేశించడానికి సంసిద్ధంగా ఉందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కీలక ఖనిజాల సదస్సులో ఆయన సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. కీలక ఖనిజాల రంగంలోనూ సింగరేణి సంస్థ ప్రముఖ పాత్ర పోషించనుందని, సింగరేణి గనుల్లోని బొగ్గు మట్టి పొరలలో ఆర్.ఈఈ (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఉన్నట్లు పలు ప్రాథమిక అధ్యయనాల్లో వెల్లడైందని, వీటి నుండి కీలక ఖనిజాల ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా విడుదలవుతున్న ఫ్లై యాష్‌లను భువనేశ్వర్‌లోని ఐఎమ్ఎమ్టీ లేబరేటరీల్లో పరిశీలన జరపగా ఆర్ ఈ ఈ ఎలిమెంట్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో కూడా కీలక ఖనిజాలు మరియు ఆర్ఈఈ ఉనికి గమనించబడిందన్నారు. రామగుండం ఓపెన్ కాస్ట్ రెండు గనిలో, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఫ్లై యాష్ , బాటమ్ యాష్ లో లైట్ హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్నట్లు తెలిపారు. నేషనల్ నేషనల్ జియోఫిజికల్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ హైదరాబాద్ వారి చేత జరిపిన పరిశోధనలు కూడా రామగుండం ఓపెన్ కాస్ట్ 2 గనిలో వెనాడియం, స్ట్రాంటియం, జిర్కోనియం కనుగొనబడిందన్నారు. కీలక కణజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ప్రోత్సహం అందిస్తుందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో కీలక ఖనిజాల ఉనికిని కనుగొనడం, విశ్లేషణ జరపడం కోసం త్వరలోనే జియో సైన్స్ లేబరేటరీని సింగరేణి ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. సింగరేణి సంస్థ కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్ఎండిసి సంస్థలతోనూ ఇతర సంస్థలతోనూ చర్చించడం జరిగిందన్నారు. ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కీలక ఖనిజాల ఉత్పత్తికి ఉమ్మడిగా పాల్గొనే విషయంపై చర్చించామన్నారు. కీలక ఖనిజాల రంగంలో దేశ స్వయం సమృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడానికి, జాయింట్ వెంచర్లు గా ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉందన్నారు. ఈ రంగంలో సలహాలు, సంప్రదింపులకు డెలాయిట్ సంస్థను కన్సల్టెంట్గా నియమించుకున్నామని, అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోయే కీలక ఖనిజాల వేలంలోనూ పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి భారతదేశం కీలక ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారన్నారు. దీనికి ఇప్పటికే ఖనిజ రంగ రంగం లో ఉన్న పరిశ్రమలు కీలక ఖనిజ రంగంలోకి కూడా ప్రవేశించాలని పిలుపునిచ్చారని బలరాం వెల్లడించారు. ఈ సమావేశంలో కోల్ ఇండియా తో పాటు ప్రముఖ ఖనిజ ఉత్పత్తి సంస్థలు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశాయన్నారు.

Next Story