- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిమ్ బాక్స్ రాకెట్ బట్టబయలు.. ముగ్గురు అరెస్ట్, 200 సిమ్ కార్డులు స్వాధీనం
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ), టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ లు హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఒక సిమ్ బాక్స్ సెటప్‌ను ఛేదించి, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ), టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ లు హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఒక సిమ్ బాక్స్ సెటప్‌ను ఛేదించి, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఒక సిమ్ బాక్స్‌తో పాటు సుమారు 200 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళితే టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్‌లోని 'చక్షు పోర్టల్' ద్వారా సైబర్ మోసానికి సంబంధించిన ఒక ఫిర్యాదును అందుకుంది. ఈ ఫిర్యాదు ఆధారంగా, టీజీసీఎస్బీ బృందం కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్స్) ను విశ్లేషించి, సిమ్ బాక్స్ సెటప్ స్థానాన్ని గుర్తించింది.
ఈ దాడుల్లో హైదరాబాద్ కు హఫీజ్ బాబానగర్ కు చెందిన హిదాయతుల్లా (28), సిమ్ కార్డుల విక్రేత అహద్ ఖాన్ (25), ఫూల్ బాగ్ కు చెందిన సిమ్ కార్డుల సేల్స్ మ్యాన్ షైక్ షోయెబ్ (24) అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు హిదాయతుల్లా సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. కారుల వ్యాపారంలో నష్టాలు వచ్చిన తర్వాత, అతను ఒక పెట్టుబడి గ్రూప్‌లో చేరి, దాదాపు రూ. 16 లక్షలు పోగొట్టుకున్నాడు. తరువాత, అతని స్నేహితుడు అతడిని వెనిస్సా అనే మహిళకు పరిచయం చేశాడు. వెనిస్సా సూచనల మేరకు, హిదాయతుల్లా సిమ్ బాక్స్ సెటప్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించాడు. ఫిబ్రవరి 2025లో అతనికి సిమ్ బాక్స్ కొరియర్ ద్వారా వచ్చింది.
వెనిస్సా వీడియో కాల్ ద్వారా దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో వివరించింది. సిమ్ బాక్స్ ఏర్పాటు చేసిన తర్వాత, హిదాయతుల్లా తన స్నేహితుడు అహద్ ఖాన్‌ను సంప్రదించాడు. అహద్ ఖాన్, అతని స్నేహితుడు షోయెబ్ బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ పీఓఎస్ ఏజెంట్లుగా ఉన్నారు. వీరు కొల్లూరు ప్రాంతంలోని నిర్మాణ కార్మికుల ఆధార్ కార్డులను ఉపయోగించి అదనపు సిమ్ కార్డులను మోసపూరితంగా పొందారు. ఇలా దాదాపు 500 సిమ్ కార్డులను హిదాయతుల్లాకు సరఫరా చేశారు. ఈ సిమ్ బాక్స్‌ను ఉపయోగించి అంతర్జాతీయ వీఓఐసీ కాల్స్‌ను లోకల్ ఫోన్ కాల్స్‌గా మార్చి, సైబర్ నేరగాళ్లు తమ గుర్తింపును దాచుకుంటారు. ఈ కేసులో సిమ్ బాక్స్ ద్వారా పెద్ద ఎత్తున రిమోట్ కాల్స్ జరిగినట్లు, అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోంది. ప్రజలు విదేశీ నంబర్ల నుండి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.






