మౌనం కాదు పరిష్కారం.. సైబర్ నేరాలపై వెంటనే ఫిర్యాదు చేయండి: డీజీ చారు సిన్హా

by Ramesh Naini |

డిజిటల్ మాధ్యమాల్లో మహిళలు, చిన్నారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా స్పష్టం చేశారు.

మౌనం కాదు పరిష్కారం.. సైబర్ నేరాలపై వెంటనే ఫిర్యాదు చేయండి: డీజీ చారు సిన్హా
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిజిటల్ మాధ్యమాల్లో మహిళలు, చిన్నారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా స్పష్టం చేశారు. ఆన్‌లైన్ వేధింపులపై బాధితులు మౌనంగా ఉండటం వల్ల నేరస్తులు మరింత బరితెగించే ప్రమాదం ఉందని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ డీజీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో డిజిటల్ హుందాతనం గౌరవం అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డీజీ చారు సిన్హా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయండి..

మొబైల్ ఫోన్ సోషల్ మీడియా వినియోగంలో నెటిజన్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డీజీ అన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ వేదికలపై ఇతరుల ఏకాంతాన్ని అంగీకారాన్ని గౌరవించడమే అసలైన హుందాతనమని ఆమె అభివర్ణించారు. సామాజిక మాధ్యమాల్లో మనం చేసే పోస్టులు లేదా సమాచార మార్పిడి ఇతరుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తాయో ముందుగానే అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ స్పేస్‌లో సైబర్ స్టాకింగ్, ట్రోలింగ్, బల్లీయింగ్, డాక్సింగ్ వంటి వేధింపులు పెరిగిపోతున్నాయని, వీటి పట్ల యువత, విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ విద్వేషాల కోసం దుర్వినియోగం చేయకుండా, ఆన్‌లైన్‌లో సానుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు.

బాధితులకు అండగా..

ఆన్‌లైన్‌లో ఎవరైనా వేధింపులకు గురైతే ఏమాత్రం భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్స్ లేదా పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని డీజీ అన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు పటిష్టమైన చట్టపరమైన నిబంధనలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. వేధింపులను అడ్డుకోవడంలో బాధితులకు మద్దతుగా నిలవడంలో సమాజం సమిష్టి బాధ్యత వహించాలన్నారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సైబర్ భద్రత,చట్టపరమైన అంశాలపై వారు అడిగిన పలు సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. యువతలో డిజిటల్ భద్రత పట్ల విస్తృత అవగాహన కల్పించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తుందని డీజీ చారు సిన్హా తెలిపారు.

Next Story