- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone tapping case: ఎట్టకేలకు సిట్ విచారణకు శ్రవణ్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు తప్పవా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6 శ్రవణ్‌రావు (Shravan Rao) ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ఎదుట హాజరయ్యారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. తొలుత లండన్ అక్కడి నుంచి అమెరికా వెళ్లి సిట్ విచారణకు రాకుండా తప్పించుకున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్‌రావుకు ఊరట లభించింది. ఆయన్ను ముందస్తుగా అరెస్టు చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని శ్రవణ్‌రావుకు స్పష్టం చేసింది. ఈ క్రమంలో శ్రవణ్‌రావు విచారణకు హాజరు కావాలని ఈ నెల 26న సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దేశం రప్పించేందుకు ఇటీవల రెడ్ కార్నర్ (Red Corner Notice) నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే.
కీలకం కాబోతున్న శ్రవణ్ రావు స్టేట్ మెంట్?:
ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న శ్రవణ్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా పలువురిపై నిఘా ఉంచారనే పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao), ప్రణీత్ రావు నడుచుకున్నట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రయోజనం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు, వారికి ఆర్థికంగా అండగా ఉన్న వ్యాపారులపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావే సూచించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో లేకపోవడంతో కీలక అంశాల్లో కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఆగిపోయింది. ఈ క్రమంలో ఇవాళ తొలిసారి సిట్ ముందుకు హాజరైన శ్రవణ్ రావు స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేయబోతున్నారు. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు కంటిన్యూ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ రావు తన స్టేట్ మెంట్ లో ఏయే అంశాలు రివీల్ చేయబోతున్నారు? దాంతో ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.






