చరిత్ర చెప్పేదెవరు..! రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ గైడ్‌ల కొరత

by Ramesh Naini |

చరిత్రను వివరించే వారు లేక ఫారిన్ టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చరిత్ర చెప్పేదెవరు..! రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ గైడ్‌ల కొరత
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం న్యూ టూరిజం పాలసీని చేపట్టింది. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని మొదటి ఐదు రాష్ట్రాలలో ఒకటిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం లేదు. తెలంగాణలోని చారిత్రక పర్యాటక ప్రదేశాలలో గైడ్‌ల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు చారిత్రక నేపథ్యాన్ని, కట్టడాల విశిష్టతను సమగ్రంగా వివరించే వారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అనేక చారిత్రక, దర్శనీయ స్థలాలు ఉన్నా వాటి వైభవాన్ని వివరించే గైడ్‌లు సరిపడా లేక టూరిస్టులు కేవలం సందర్శనతోనే సరిపెట్టుకుంటున్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోని తొమ్మిది కట్టడాలు ఉన్నాయి. రాష్ట్ర పురావస్తు, ఇతర చారిత్రక ప్రాంతాలు వందల్లోనే ఉన్నాయి. పర్యాటక శాఖ తరపున నియమితులైన గైడ్‌లు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా 13 మందే ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఐదుగురు, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో ముగ్గురి చొప్పున ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పనిచేస్తున్నారు.

కాకతీయుల వైభవాన్ని వివరించేవారు లేక:

ప్రఖ్యాత వరంగల్‌లోని కాకతీయుల కట్టడాలు రాష్ట్ర చరిత్రకు, సంస్కృతికి అద్దం పడతాయి. అయితే, వాటి విశిష్టతను, చరిత్రను పర్యాటకులకు పూర్తి స్థాయిలో వివరించేవారు అందుబాటులో లేరు. ప్రస్తుతం, ఆలయాల చరిత్రను, నిర్మాణ శైలిని వివరించడానికి అర్చకులు లేదా పురావస్తు అధికారులు మాత్రమే అడపాదడపా పర్యాటకులకు సహాయం చేయాల్సి వస్తోంది. హన్మకొండలోని వేయి స్తంభాల గుడికి ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా సందర్శకులు వస్తుంటారు. ఈ కాకతీయుల ఆలయంలో శిల్ప వైభవాన్ని వారికి వివరించడానికి పర్యాటక శాఖ తరపున ఒక్క గైడ్ కూడా లేరు. ఎవరైనా విదేశీ టూరిస్టులు, ప్రముఖులు సందర్శించినప్పుడు మాత్రం అర్చకులు, పురావస్తు శాఖ అధికారులు గైడ్‌లుగా మారి వారికి చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తారు.

యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకు సందర్శకుల తాకిడి:

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందిన వరంగల్‌ సమీపంలోని రామప్ప ఆలయాన్ని వీకెండ్‌లలో వేలాది మంది సందర్శకులు సందర్శిస్తున్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలోనూ గైడ్‌ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రామప్ప ఆలయంలో ఇద్దరు గైడ్‌లు మాత్రమే ఉన్నారు. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చినప్పటి సందర్శించే నుంచి దేశీ, విదేశీ టూరిస్టుల సంఖ్య భారీగా పెరిగిందని అక్కడి ఆలయ సిబ్బంది, కొందరు ట్రావెలర్స్ చెబుతున్నారు. వీకెండ్‌లలో సైతం వేలల్లో సందర్శకులు వరుస కడుతున్నారు. సెలవు రోజుల్లో అక్కడ కనీసం ఇద్దరు గైడ్‌ల అవసరం ఉందని సందర్శకులు చెబుతున్నారు.

భారీగా గైడ్‌ల కొరత:

రాష్ట్రవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రాల ప్రాధాన్యతకు అనుగుణంగా కనీసం 100 మంది టూరిస్ట్ గైడ్‌ల అవసరం ఉందని గతంలో రాష్ట్ర పర్యాటక శాఖ అంచనా వేసింది. గైడ్‌ల నియామకం చివరిసారిగా 2004లో రూ. 600 జీతంతో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో జరిగింది. ఆ సమయంలో కేవలం 14 మందిని మాత్రమే నియమించారు. వీరిలో ప్రస్తుతం 13 మంది మాత్రమే కొనసాగుతున్నారు. తర్వాత మళ్లీ నియామకం చేపట్టలేదు. గత రెండు దశాబ్దాలుగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నా, నియామకాలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఆ గైడ్‌లు కేవలం 4 వేల జీతం మాత్రమే పొందుతున్నారు. నాలుగేళ్ల క్రితం అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి కనీస వేతనం రూ. 19 వేలు చెల్లించాలని పలుమారు విన్నవించడంతో ఆయన అంగీకరించారు. గైడ్లకు రూ. 15,500 లకు వేతన పెంపు ఫైల్ ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉంది. ఇకనైనా ప్రభుత్వం చారిత్రక కట్టడాల వైభవాన్ని, తెలంగాణ చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలంటే, రాష్ట్ర పర్యాటక శాఖ వెంటనే గైడ్‌ల నియామకంపై దృష్టి సారించాలని పర్యాటక రంగ నిపుణులు, స్థానికులు కోరుతున్నారు.

Next Story