ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో షాకింగ్ రిజల్ట్స్ పక్కా.. మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు రావడం పక్కా అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో షాకింగ్ రిజల్ట్స్ పక్కా.. మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు రావడం పక్కా అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఇవాళ ఢిల్లీలో సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడతూ.. తెలుగు ఎంపీలంతా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికే మద్దతునివ్వాలని కోరారు. ఆయనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. ఆయన గెలుపు కోసం తెలుగు ఎంపీలంతా కృషి చేయాల్సి అవసరం ఉందన్నారు. త్వరలోనే సుదర్శన్ రెడ్డి పలు రాష్ట్రాల్లో పర్యటించి ఇండియా, ఎన్డీఏ కూటమిలోని పలు రాజకీయ పార్టీలతో పాటు ఎంపీల మద్దతును కోరతారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీలకు విప్ ఉండదని తెలిపారు. కాబట్టి ఎంపీలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా తాను కూడా సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం ఎంపీల మద్దతు కోరతానని మల్లు రవి స్పష్టం చేశారు.

కాగా, ఎన్టీఆర్-చంద్రబాబు మధ్య పార్టీ గుర్తు కోసం కేసు నడిచిన సమయంలో సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కీలక తీర్పులను చెప్పారని తెలిపారు. ఆయన ఎప్పుడూ ప్రజల కోణంలో ఆలోచించే వ్యక్తి అని మల్లు రవి కొనియాడారు. పార్లమెంట్‌లో ఉభయ సభలను నిర్వహించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్లాన్ ప్రకారం సభల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించారని కామెంట్ చేశారు. ఇక తెలంగాణ ఎంపీలంతా కలిసి కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం, సెమీ కండక్టర్ యూనిట్స్, తెలంగాణలో ఎయిర్‌పోర్టులు, మూసీ నదీ ప్రక్షాళన వంటి అంశాలపై సంబంధిత మంత్రులకు లేఖలు రాసినట్లుగా ఎంపీ మల్లు రవి వెల్లడించారు.

Next Story