హైదరాబాద్‌లో షాకింగ్ రైడ్.. పులి దంతాలు, గోర్లు పట్టివేత, ఇద్దరు అరెస్ట్

by Ramesh Naini |

అక్రమ వన్యప్రాణి వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు ఉక్కుపాదం మోపారు.

హైదరాబాద్‌లో షాకింగ్ రైడ్.. పులి దంతాలు, గోర్లు పట్టివేత, ఇద్దరు అరెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రమ వన్యప్రాణి వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫిబ్రవరి 9న నాంపల్లి ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో పులి కే నైన్ దంతాలు 2, పులి గోర్లు 7ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు కొనుగోలుదారులుగా నటిస్తూ నిందితులను సంప్రదించారు. నాంపల్లిలోని హోటల్ ఏషియన్ ఇంటర్నేషనల్ గది నెం. 305 లో లావాదేవీలు జరగనున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి అవశేషాలు.. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. విచారణలో నిందితులు ఈ వన్యప్రాణి అవశేషాలను కేరళ రాష్ట్రానికి చెందిన జకారియా అనే వ్యక్తి నుంచి పొందినట్లు ఒప్పుకున్నారు. అతడు ఇద్దరు నిందితులకు సన్నిహిత మిత్రుడని తెలిపారు.

కేరళ అటవీ శాఖకు సమాచారం

ఈ ఘటనపై సెంట్రల్–I సెక్షన్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి పంచనామా నిర్వహించి, పీఓఆర్ నెం. 12-07/2022-23 కింద కేసు నమోదు చేశారు. పులి (పాంథేరా టైగ్రిస్) వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 లోని షెడ్యూల్–I కింద అత్యంత రక్షిత జాతి కావడంతో, అక్రమంగా కలిగి ఉండటం, వ్యాపారం చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న జిల్లా అటవీ అధికారి నిందితులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి, 15 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కేరళ అటవీ శాఖకు పంపించగా, వన్యప్రాణి అవశేషాల మూలాన్ని గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Next Story