- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మకుంట వివాదంలో BIG ట్విస్ట్: సుప్రీంకోర్టులో హైడ్రాకు ఎదురుదెబ్బ
అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట భూవివాదం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ కుంటపై తమ ఆధిపత్యాన్ని సూచించే బోర్డులు, శిలాఫలకాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైడ్రా (HYDRAA) అధికారులు చర్యలు చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట భూవివాదం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ కుంటపై తమ ఆధిపత్యాన్ని సూచించే బోర్డులు, శిలాఫలకాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైడ్రా (HYDRAA) అధికారులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు కుంట వద్ద ఉన్న 'హైడ్రా' నేమ్ బోర్డులను సిబ్బంది తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్‌లోని సుమారు ఏడు ఎకరాల స్థలం విషయంలో ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి, ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా న్యాయపోరాటం నడుస్తోంది. ఈ స్థలం తన వ్యక్తిగత ఆస్తి అని, ఇది ఎప్పుడూ కుంట (నీటి వనరు) కాదని సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. అయితే ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టిందని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా భావించిన హైడ్రా.. ఇక్కడ సుమారు ఐదు ఎకరాల్లో చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ ఎయిర్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసి సుందరీకరించింది. గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
న్యాయస్థానాల ఆదేశాలు..
కోర్టులో స్టేటస్ కో (యథాతథ స్థితి) ఆర్డర్ ఉండగా అభివృద్ధి పనులు చేయడంపై గతంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కరణగా భావించి, అక్కడ హైడ్రాకు సంబంధించిన పేర్లు, గుర్తులను మూడు వారాల్లోగా తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హైడ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, తదుపరి విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైడ్రా సిబ్బంది బతుకమ్మ కుంట వద్ద ఉన్న తమ విభాగానికి సంబంధించిన బోర్డులు మరియు ప్రారంభోత్సవ శిలాఫలకాలను తొలగించారు. ఈ పరిణామం అంబర్‌పేట్ రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విచారణ ముగిసే వరకు ఈ స్థలం ఎవరికి చెందుతుందనేది ఉత్కంఠగా మారింది.






