- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొందరలోనే చీకట్లోకి రాష్ట్రం.. ఉచిత విద్యుత్ పొందుతున్న అందరిపై పిడుగు : మాజీ మంత్రి జగదీష్
రాష్ట్రం తొందరలోనే చీకట్లోకి నెట్టివేయబడుతుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.

- ఆర్‌డీఎస్ఎస్ విధానంతో ప్రజలకు నష్టం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం తొందరలోనే చీకట్లోకి నెట్టివేయబడుతుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్‌డీఎస్ఎస్ కారణంగా రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులతో పాటు ప్రతి ఒక్కరి నెత్తిపైనా పిడుగు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని మొదటి నుంచి కేసీఆర్ వ్యతిరేకించారని.. ఉత్తరప్రదేశ్‌లో ఈ స్కీమ్ కింద మీటర్లు పెడితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి మీటర్లను తగలబెట్టారని తెలిపారు. ఏపీలోనూ ఈ పథకాన్ని శ్రీకాకుళంలో పెట్టి వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేసి, తెలంగాణలో అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా, ప్రాంతీయ పార్టీనా అని నిలదీశారు. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ప్రతిఒక్కరి ఇంట్లో మీటర్లు పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. ఆర్‌డీఎస్ఎస్ మీటర్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ముందే రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుందని.. లేకపోతే కరెంట్ కట్ అవుతుందని అన్నారు. అంతేకాకుండా.. ఈ స్కీమ్ ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్సంటేజీలతో మీటర్ ఖర్చు ఎంతకు పోతుందో తెలియదని అన్నారు. కొత్తగా రూరల్ డిస్కం తెచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నదని.. రూరల్ డిస్కంను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే బతుకులు చీకటవుతాయని కేసీఆర్ ముందు నుంచీ చెప్తూనే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తొందర్లోనే బంగాళాఖాతంలో వేయడం ఖాయమని.. ఆర్‌డీఎస్ఎస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నదని స్పష్టం చేశారు.






