BIG BREAKING: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

by velandi.Saikiran |   (  Updated:2026-03-05 18:13:06  IST  )

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్‌గా నియామ‌కం అయ్యారు.

BIG BREAKING: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, మరి కొందరిని బదిలీ చేస్తూ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కీలకంగా మారిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి. ఈ ఖాళీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

​రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త నియామకాలు జ‌రిగాయి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్‌గా నియామ‌కం అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన జిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవి పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

తరంజిత్ సింగ్ సంధు ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఢిల్లీ ఎల్జీగా ఉన్న వినయ్ కుమార్ సక్సేనా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ​లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కవీందర్ గుప్తా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. నంద్ కిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ​పై నియామకాలన్నీ వారు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తన ప్రకటనలో పేర్కొంది.

Next Story