- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరవీరుల స్తూపాన్ని నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన దుండిగల్ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన దుండిగల్ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన కూడా అమరవీరుల స్తూపాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఉద్యమకారులతో కలిసి స్వయంగా నీటితో శుభ్రం చేసి అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడటానికి వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన రోజునే అమరవీరుల స్మారక స్తూపం నిర్లక్ష్యానికి గురికావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా మరెప్పుడు పట్టించుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గౌరవం? అని నిలదీశారు. అమరవీరుల స్తూపాల సంరక్షణను విస్మరించడం అంటే కేవలం ఒక నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం కాదని.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని గుర్తుచేశారు. ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరవీరుల స్తూపాల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను సాధించిన అమరవీరుల త్యాగాలను మరచిపోయే ప్రభుత్వాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు.






