SFI: ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో 5 వేల సీట్లు భర్తీ చేయాల్సిందే.. ఎస్ఎఫ్ఐ డిమాండ్

by Ramesh Naini |

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో దాదాపు 5 వేల సీట్లను భర్తీ చేయాలని, ఏటీసీల పేరుతో సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు నిలిపివేయడం సరికాదని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది.

SFI: ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో 5 వేల సీట్లు భర్తీ చేయాల్సిందే.. ఎస్ఎఫ్ఐ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ (ITI colleges) ఐటీఐలలో దాదాపు 5 వేల సీట్లను భర్తీ చేయాలని, ఏటీసీల పేరుతో సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు నిలిపివేయడం సరికాదని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఎస్.వి.కె. నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రభుత్వ ఐటీఐలలో మొత్తం 4,884 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఎస్ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రికల్, వెల్డర్, టర్నర్, స్టెనోగ్రాఫీ, డ్రెస్ మేకింగ్, కోపా, సివిల్, ఎం.ఎం.వీ, మెకానిక్, వుడ్ వర్క్, డీజిల్ మెకానిక్ వంటి అనేక ట్రేడ్లలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు నిలిపివేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు..

ఏటీసీలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ చర్యతో విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చే సాంప్రదాయ ట్రేడ్లలో ప్రవేశాలను నిలిపివేయడం అన్యాయమని ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజినీకాంత్, టి. నాగరాజు అన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని వారు విమర్శించారు. ప్రభుత్వ ఐటీఐలలో సీట్లు భర్తీ చేయకుండా (Private colleges) ప్రైవేట్ కళాశాలలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ ట్రేడ్లలో ప్రవేశాలు ప్రారంభించాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Next Story