హైడ్రా నిర్లక్ష్యం అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్

by Prasad Jukanti |

హైదరాబాద్ వరద ముప్పు, సోషల్ మీడియా విమర్శలపై హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ అధికారిక వివరణ ఇచ్చారు.

హైడ్రా నిర్లక్ష్యం అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వానాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో రోడ్లన్ని చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి వాహనాలపై పడ్డాయి. అయితే వరద నీటితో రోడ్లన్ని నిండిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో హైడ్రా నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. గతంలో డ్రైనేజీ సిల్ట్ పూడికలు మేం చేస్తామని హైడ్రా ప్రకటించి ఆ పనులు చేయకపోవడంతో గంట పాటు కురిసిన వర్షానికి అంతా అతలాకుతలం అయిందనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో తమపై వస్తున్న ఆరోపణలపై హైడ్రా స్పందించింది. తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వేదికగా తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారిక వివరణ ఇచ్చారు.

హైడ్రా ప్రధాన కర్తవ్యం ఇదే:

హైదరాబాద్ పరిధిలో ఉన్న జల సంపదను కాపాడటం హైడ్రా ప్రధాన కర్తవ్యం అని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా, చెరువులను, నాలాలను ఆక్రమణల నుండి కాపాడి, తద్వారా వరద నీటి ప్రవాహానికి తోడ్పడటం, గతం నుండి నగరంలో సహజంగా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి, భవిష్యత్తులో వరద ముప్పును తప్పించడం హైడ్రా కర్తవ్యం అని వివరించారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1.10 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడిందని ఇందులో ప్రభుత్వ భూములలో ఉన్న ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలకు చెందిన 2,435.23 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా మొదటి విడతలో వివిధ చోట్ల 70 ఎకరాల చెరువులను కాపాడిందని రెండో విడతలో నగరవ్యాప్తంగా 14 చెరువులకు సంబంధించి సుమారు 300 ఎకరాలను కాపాడినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఫలితాలు:

హైడ్రా చేపట్టిన పనుల వల్ల ఇప్పుడు చాలా చోట్ల భారీ వర్షం పడినా వరద నీరు నిలవకుండా సాఫీగా వెళ్తోందని దీనికి అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ వర్షం వస్తే చుట్టుపక్కల కాలనీలు, బస్తీలు పూర్తిగా మునిగిపోయేవని హైడ్రా తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు వరద నీరు నేరుగా చెరువులోకి చేరుతోంది. దీనివల్ల కాలనీలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు. చెరువులను, నాలాలను ఆక్రమణల నుండి కాపాడటం, తద్వారా భవిష్యత్తులో ఎటువంటి వరద ముప్పు నగరానికి ఉండకుండా చూసుకోవడం హైడ్రా ధ్యేయం అని కాబట్టి, ప్రజలు సామాజిక మాధ్యమాలలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారికంగా ప్రభుత్వ మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరారు.

Next Story